నేడు నిర్మల్‌ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

నవతెలంగాణ – నిర్మల్
నిర్మల్‌ జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ భవనం ప్రారంభానికి ముస్తాబైంది. కలెక్టరేటా? కార్పొరేట్‌ సంస్థ కార్యాలయమా? అని ఆశ్చర్యపోయేలా నిర్మించిన ఈ కొత్త పాలనా సౌధంతో జిల్లాలో ప్రజలకు ప్రభుత్వ సేవలన్నీ ఒకేచోట లభించనున్నాయి. ఈ భవనాన్ని సీఎం కేసీఆర్‌ ఆదివారం ప్రారంభించనున్నారు. నిర్మల్‌ రూరల్‌ మండలంలోని ఎల్లపెల్లి గ్రామ శివారులో రూ.56 కోట్లతో కొత్త కలెక్టరేట్‌ను నిర్మించారు. సుమారు 16 ఎకరాల్లో 1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్‌ టు విధానంలో దీనిని నిర్మించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో కలెక్టర్‌, అదనపు కలెక్టర్ల కార్యాలయాలతోపాటు రెండు వెయిటింగ్‌ హాళ్లు, రెండు వీడియోకాన్ఫరెన్స్‌ హాళ్లు, అధికారుల సహాయకులకు రెండు ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. దాదాపు 500 మందితో ఒకేసారి సమావేశం నిర్వహించేలా సువిశాల కాన్ఫరెన్స్‌ హాల్‌ను కూడా గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నిర్మించారు. మొదటి అంతస్థును మంత్రి చాంబర్‌తోపాటు వివిధ శాఖల కార్యాలయాలకు కేటాయించారు. కలెక్టరేట్‌ను పూర్తి ఆక్సిజన్‌ జోన్‌గా రూపొందించారు. భవనంలో రెండు లిఫ్టులున్నాయి. ఇక్కడ గ్రానైట్‌ పనులు పూర్తికావడంతో సువిశాల కారిడార్లు కనువిందు చేస్తున్నాయి. ప్రహరీతోపాటు ముఖద్వార ఆర్చ్‌, సెక్యూరిటీ గార్డు గది నిర్మాణం పూర్తయింది. అండర్‌గ్రౌండ్‌లో 80 వేల లీటర్ల సామర్థ్యంతో సంప్‌, 20 వేల లీటర్ల సామర్థ్యంతో రెండు ఓవర్‌హెడ్‌ ట్యాంకులను నిర్మించారు. కలెక్టరేట్‌ ముందు ఆవరణలో హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌ సముదాయానికి నాణ్యమైన, నిరంతర విద్యుత్తును అందించేందుకు ప్రత్యేక సబ్‌స్టేషన్‌ను ఏర్పాటుచేశారు.

Spread the love