– ఆయన అసమర్థత వల్లే ఈ ఘటన
– తెలిసినా తెలియనట్టు నటించారా..?
– సుంకిశాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సుంకిశాల ప్రాజెక్టు పంప్‌హౌజ్ నీట మునిగిన ఘటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే పూర్తి బాధ్యత వహించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. పురపాలక శాఖను కూడా పర్యవేక్షిస్తున్న సీఎం అసమర్థత, చేతగానితన ం వల్లే ఆ ఘటన జరిగిందని ఆయన విమర్శించారు. ఈ విషయంలో ప్రభుత్వ తప్పిదం లేకుంటే వారం రోజులపాటు దాన్ని ఎందుకు పట్టారని నిలదీశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్ తదితరులతో కలిసి కేటీఆర్ మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలోనే సుంకిశాల ఘటన సంభవించిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ విషయాన్ని సభలో ప్రకటించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని చెప్పారు. కానీ రేవంత్ సర్కారు అలా చేయలేదని విమర్శించారు. అంటే ప్రమాదం జరిగిన విషయమే ప్రభుత్వానికి తెలియ దా? లేక తెలిసినా తెలియనట్టు నటించారా..? అని ప్రశ్నించారు. సంఘటన గురించి తెలిసినా కావాలనే గోప్యంగా ఉంచారని దుయ్యబట్టారు. హడావుడిగా పనులు ప్రారంభించటంతోనే ఈ దుస్థితి దాపురించిందంటూ అధికారులు చెబుతున్నారని వాపోయారు. అదృష్టవశాత్తూ కూలీలు షిఫ్టు మారిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందనీ, లేదంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించేందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వాస్తవాలను మరుగుపరిచిన ప్రభుత్వం, తమ మీద, తమ పార్టీ మీద తప్పుడు ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తన బాధ్యతను తాను నెరవేర్చకుండా బీఆర్‌ఎస్‌పై నిందలు మోపటం సిగ్గుచేటని విమర్శించారు. ఘటనపై పూర్తిస్థాయి న్యాయ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఓట్ల కోసం కాళేశ్వరంపై అడ్డగోలు వాదనలు చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత అవన్నీ పసలేనివిగా తేలాయంటూ ఎద్దేవా చేశారు.