నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలోని ముస్లిం సోదరులందరికీ సీఎం రేవంత్ రెడ్డి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను రాష్ట్రంలోని ముస్లింలందరూ ఆనందంగా జరుపుకొని అల్లా దీవెనలను అందుకోవాలని ఆకాంక్షించారు. నెల రోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే రంజాన్ పండుగను ముస్లింలు తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరితో ఇంటిల్లిపాది సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని సేవలకు మించి మానవ సేవ అత్యున్నతమైనదని చాటి చెప్పే రంజాన్ పండుగ లౌకిక వాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో ముస్లింలు అనుసరించే కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దాన ధర్మాలు మానవాళికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు రేవంత్ రెడ్డి.