నిరుద్యోగులారా.. మోసపోవద్దు: సీఎం రేవంత్ రెడ్డి

 

నవతెలంగాణ హైదరాబాద్‌: తరచూ పరీక్షలు వాయిదా వేయడం వల్ల నష్టపోయేది విద్యార్థులే అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలో అభ్యర్థులు ఏండ్ల తరబడి కోచింగ్‌ సెంటర్లు, లైబ్రరీల చుట్టూ తిరిగేవారని, వాయిదాల వల్ల విద్యార్థులు ఇతర ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అన్నారు. కొన్ని పార్టీల మాయమాటలు నమ్మి మోసపోవద్దని నిరుద్యోగులకు సూచించారు. రాజేంద్రనగర్‌ పోలీస్‌ అకాడమీలో పోలీస్‌ డ్యూటీ మీట్‌ ముగింపు కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. ‘‘నోటిఫికేషన్‌ ఇచ్చిన తర్వాత నిబంధనలు మారిస్తే కోర్టులు కొట్టివేస్తాయి. జీవో 55 ప్రకారం పోతే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నష్టం జరిగేది. గ్రూప్‌-1 మెయిన్స్‌లో 1:50కి కూడా రిజర్వేషన్లు పాటిస్తున్నాం. ఉద్యోగాల భర్తీపై గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. గడిచిన పదేండ్లలో ఉద్యోగాల భర్తీని అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. గత పదేండ్లు నిరుద్యోగులను వీళ్లు ఎప్పుడైనా కలిశారా? ఎప్పుడైనా అశోక్‌ నగర్‌కు వచ్చి మాట్లాడారా? ప్రగతిభవన్‌కు పిలిపించుకున్నారా? పరీక్షల నిర్వహణ విధానాన్ని న్యాయస్థానాలు కూడా సమర్థించాయి.  విద్యార్థులు అందోళనలు విరమించి పరీక్షలకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తున్నా. మోసగాళ్ల మాటలు విని మోసపోవద్దని నిరుద్యోగులను కోరుతున్నా. ఆందోళన చేస్తున్న విద్యార్థుల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించవద్దని కోరుతున్నా’’ అని రేవంత్‌ పేర్కొన్నారు.
పెనుసవాల్‌గా సైబర్‌ నేరాలు
సైబర్‌ నేరాలు కూడా ప్రజలకు, పోలీసులకు పెను సవాల్‌గా మారాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సైబర్‌ నేరాల దర్యాప్తులో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో అవార్డు వచ్చిందని గుర్తు చేశారు. ‘‘సమాజంలో నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. గతంలో జరిగిన నేరాలకు, ప్రస్తుత నేరాలకు పొంతన లేదు. డ్రగ్స్‌ మహమ్మారి రాష్ట్రానికి సవాలుగా మారింది. పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి గంజాయి రవాణా పెరిగింది. జిల్లాల్లోని పోలీసులు గంజాయిని రాష్ట్ర సరిహద్దుల్లోనే సమర్థంగా అడ్డుకోవాలి’’ అని రేవంత్ పిలుపునిచ్చారు.

Spread the love