మేడిగడ్డకు సీఎం రేవంత్‌రెడ్డి !

CM Revanth Reddy to Medigadda!– ఈనెల 13న, మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి బ్యారేజీ పరిశీలన
– ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్‌

నవతెలంగాణ-భూపాలపల్లి
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి ఈనెల 13న మంగళవారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు రానున్నారు. ఎమ్మెల్యేలతో కలిసి మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు వెళుతున్నట్టు సీఎం అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అక్రమాలపై కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టింది. సీఎం, ఎమ్మెల్యేల పర్యటన నేపథ్యంలో మేడిగడ్డ వద్ద భారీ భద్రత ఏర్పాట్లకు జిల్లా కలెక్టర్‌తోపాటు ఎస్పీ నుంచి పోలీసులకు ఆదేశాలందాయి. మహదేవపూర్‌ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద అన్ని శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లను ఆదివారం ప్రారంభించారు. రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ ఈఎన్‌సి పర్యటించి పనులను పురమాయించారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంగా మేడిగడ్డకు బస్సులలో వస్తుండటంతో రహదారిని మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా అన్ని శాఖల అధికారులతో మేడిగడ్డ వద్ద చేయాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Spread the love