నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో మతకల్లోలాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి భరోసానిచ్చారు. కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు డాక్టర్ సతీష్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని ఎల్.బీ.స్టేడియంలో నిర్వహించిన కృతజ్ఞతార్పణ (థ్యాంక్స్ గివింగ్) కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మత వివక్షకు తావులేదని స్పష్టం చేశారు. కుల, మతాలకు అతీతంగా రాష్ట్రంలో అందరికీ గౌరవం ఉంటుందని తెలిపారు. విద్య, వైద్య సేవల్లో క్రిస్టియన్ మిషనరీల కృషి అభినందనీయమన్నారు. విద్య వ్యాపారంగా మారిన ప్రస్తుత కాలంలోనూ తక్కువ ఖర్చుతో క్రిస్టియన్ మిషనరీలు నాణ్యమైన విద్య అందిస్తున్నాయని ప్రశంసించారు. క్రిస్టియన్ మిషనరీలు నిర్వహిస్తున్న ఆస్పత్రులు ఆదర్శనీ యమని కొనిడాయారు. డాక్టర్ సతీష్ సమాజ సేవకు అంకితమై 35 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. చెడును తొలగించి మంచిని పెంచేందుకు కృషి చేస్తున్న వారందరికి అభినం దనలు తెలిపారు. భారతీయ సంస్కృతి ఎంతో బలమైందనీ, భారత దేశం మత సమ్మరస్యానికి ప్రతీక అని తెలిపారు. గంజాయి, డ్రగ్స్ పీడ విరగడ చేసేలా సామాజిక బాధ్యతగా భక్తులకు సందేశం ఇవ్వాలని డాక్టర్ సతీష్‌ను కోరారు. వాటిని రూపుమాపేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ప్రభుత్వంపై మీ విశ్వాసాన్ని ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ దేశ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నెహ్రూ కుటుంబం చేసిన త్యాగాలను వివరించారు. రాహుల్ గాంధీకి అందరి మద్ధతు ఉండాలని విజ్ఞప్తి చేశారు.