యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్
బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వెళ్లిన రేవంత్‌ రెడ్డి.. కేసీఆర్‌ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. రేవంత్‌ రెడ్డి కంటే ముందు మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆస్పత్రికి చేరుకుని కేసీఆర్‌ను పరామర్శించారు. కాగా, తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం కేసీఆర్‌ కోలుకుంటున్నారు. శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడింది. వైద్యులు వాకర్‌ సాయంతో ఆయనను నడిపించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ప్రవీణ్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నదని చెప్పారు. చాలా వేగంగానే రికవరీ అవుతున్నారని అన్నారు. ఆర్థోపెడిక్‌, ఫిజియోథెరపీ వైద్యుల పర్యవేక్షణలో వాకర్‌ సాయంతో నడిపించే ప్రయత్నం చేయగా, ఆయన శరీరం బాగా స్పందించిందని తెలిపారు. బెడ్‌ బయటకు వచ్చి కూర్చున్నారని వెల్లడించారు. సాధారణంగా తుంటి కీలు మార్పిడి జరిగిన పేషెంట్‌ను 12 గంటల్లోపు నడిపించే ప్రయత్నం చేస్తామని, దీన్ని మెడికల్‌ పరిభాషలో ‘మొబిలైజేషన్‌ స్టార్ట్‌’ అంటారని వివరించారు. కేసీఆర్‌కు ఆపరేషన్‌ నొప్పి తగ్గి, సాధారణ నొప్పి మాత్రమే ఉన్నదని, ఆయన శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నారని తెలిపారు. సాధారణ ఆహారమే తీసుకుంటున్నారని పేర్కొన్నారు. బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు కూడా చేయిస్తున్నామని చెప్పారు. మరికొన్ని రోజులు ఫిజియోథెరపీ కొనసాగించాల్సి ఉంటుందని అన్నారు. శరీరం సహకరిస్తే మరో రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని తెలిపారు. కనీసం 6-8 వారాలపాటు విశ్రాంతి అవసరం ఉంటుందని వివరించారు.

Spread the love