15న సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో గోదావరి నది మీద నిర్మించిన సీతారామ ప్రాజెక్టును ఆగస్ట్ 15న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని జలసౌధలో రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల కలలు సాకారమయ్యే రోజు వచ్చిందన్న ఉత్తమ్.. గత జూన్ లో మొదటి పంపు హౌజ్ ట్రయల్ రన్ ను విజయవంతంగా నిర్వహించగా, ఆగస్ట్ 2న రెండవ పంపు హౌజ్ ట్రయల్ రన్ కూడా విజయవంతంగా నిర్వహించి గోదావరి జలాలను దిగువకు పారించామని తెలిపారు. ఈ ప్రాజెక్టు వలన కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో సుమారు 9 లక్షల ఎకరాలకు సాగు నీరందనుందని, దశాబ్దాల తన కల సాకరమవుతోందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. కాగా ఇందిరా సాగర్ మరియు రాజీవ్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లను ఒకే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గా విలీనం చేసి భద్రాద్రి సీతారామచంద్రస్వామి పేరు మీదుగా సీతారామా ఎత్తిపోతల పథకంగా పేరు మార్చింది గత ప్రభుత్వం.

Spread the love