నేడు శ్రీవారిని దర్శించుకోనున్న సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్: శ్రీవారి దర్శనార్థం సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. స్థానిక రచనా అతిథి గృహం వద్ద రేవంత్‌ రెడ్డికి టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. టీటీడీ తరఫున అధికారులు బస ఏర్పాట్లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం శ్రీవారికి తన మనవడి పుట్టు వెంట్రుకల మొక్కు చెల్లిస్తారు. అనంతరం ఉదయం 8.30 గంటలకు వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. మనవడి తలనీలాలు సమర్పించేందుకు తిరుమలకు వచ్చినట్లు తెలిపారు. మరోవైపు తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు సమయం పడుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి ఏటీసీ క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం రోజున 80,744 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో శ్రీవారికి 35,726 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. మంగళవారం రోజున శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.67 కోట్లు సమకూరింది.

Spread the love