నవతెలంగాణ – హైదరాబాద్: జనవరి 26 నుంచి రైతుభరోసా, ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాలు అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అమలు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. నాలుగు పథకాల అమలుపై రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో గ్రామసభలు, మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించాలని సూచించారు. అందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం రేవంత్ కలెక్టర్లకు దిశానిర్ధేశం చేశారు. ఈ మేరకు కలెక్టర్లతో జరుగుతోన్న సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.‘‘ఈ నెల 26 తర్వాత జిల్లాల్లో పర్యటిస్తాను. రాష్ర్టంలో ఆకస్మిక తనిఖీలు చేస్తా. సాగు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా చెల్లించాలి. పంట వేసినా.. వేయకపోయినా.. సాగుయోగ్యమైన భూమికి రైతు భరోసా ఇవ్వాలి. అనర్హులకు ఇవ్వొద్దు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పర్యటించి, అనర్హులను గుర్తించాలి. సాగు యోగ్యం కాని భూములను గుర్తించి మినహాయించాలి. స్థిరాస్తి భూములు, లేఅవుట్లు, నాలా కన్వర్షన్, మైనింగ్, గోదాములు నిర్మించిన భూములు, వివిధ ప్రాజెక్టులకు సేకరించిన భూముల వివరాలను సేకరించాలి. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల రెవెన్యూ రికార్డులను క్రోడీకరించుకోవాలి. గ్రామాల మ్యాప్‌లను పరిశీలించి క్షేత్రస్థాయిలో ధ్రువీకరించుకోవాలి. వాటిపై గ్రామ సభల్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదు’’ అని సీఎం రేవంత్ వెల్లడించారు.