– ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు
– మంత్రి వర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చలు
– నామినేట్ పదవులు, పీసీసీ అధ్యక్ష పదవిపైనా మంతనాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. సోమవారం పార్లమెంట్‌లో ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. సీఎం రెండు రోజుల పాటు డిల్లీలోనే ఉండనున్నారు. పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన రాష్ట్రానికి చెందిన అంశాలపై ఎంపీలకు ఆయన దిశా నిర్దేశం చేయనున్నారు. అలాగే మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక తదితర అంశాలపై అధిష్ఠానంతో చర్చించే అవకాశం ఉంది. డిసెంబర్ 6న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తనతో పాటు మరో 11 మందికి మంత్రి వర్గంలో చోటు దక్కింది. ఇంకా ఆరుగురికి అవకాశముండటంతో పలువురు నేతలు అదిష్టానం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం డిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ఖమ్మం జిల్లాకు మంత్రి వర్గంలో అత్యధిక ప్రాధాన్యత లభించింది. ఇక్కడి నుంచి ముగ్గురికి చోటు లభించగా, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, మహబూబ్‌నగర్‌కు రెండేసి మంత్రి పదవులు దక్కాయి. మెదక్ నుంచి ఒకరికి అవకాశం లభించింది. అయితే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు రేవంత్ జట్టులో చోటు లభించలేదు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనపై ఆయా జిల్లాలకు చెందిన పలువురు ఆశలు పెట్టుకున్నారు. అలాగే పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించి జూన్ 27న రేవంత్ గడువు ముగుస్తున్నప్పటికీ, స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఆయననే అధ్యక్షునిగా కొనసాగింంచే అవకాశమున్నట్టు సమాచారం.
నామినేట్ పదవుల భర్తీపై సమాలోచనలు
పార్లమెంట్ ఎన్నికల ముందు నామినేట్ పదవుల భర్తీకి సంబంధించి 37 కార్పొరేషన్లకు చైర్మెన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారికంగా ఉత్తర్వులు వెలువడలేదు. ఎన్నికల ఫలితాలు, తదనంతర పరిణామాల నేపథ్యంలో గతంలో వెలువడిన నామినెట్ పదవుల భర్తీని యధావిదిగా కొనసాగిస్తారా? మారుస్తారా? అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. నామినేటెడ్ పోస్టుల భర్తీని పున:సమీక్షించాలని కొంతమంది నాయకులు అధిష్టానానికి విన్నవించినట్టు సమాచారం. సీనియార్టీ ప్రాతిపదికన కాకుండా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పనితీరు ఆధారంగా పోస్టులను భర్తీ చేయాలని పార్టీ పెద్దలు యోచిస్తున్నట్టు తెలిసింది. బీఆర్‌ఎస్, ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో నామినెట్ పదవుల్లో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశముందని భావిస్తున్నారు.