నవతెలంగాణ – హైదరాబాద్ : మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టును సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలో మూసీ నది పరీవాహక ప్రాంతం బఫర్ జోన్ లో ఉన్న ఇళ్లను తొలగిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఎవరు అడ్డుపడినా మూసీ ప్రక్షాళన ఆగదని, మూసీ మురికిని వదిలిస్తామని స్పష్టం చేశారు. మూసీ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. “ఇవాళ మూసీ నది అంటే మురికి కూపం అనే పేరు స్థిరపడిపోయింది. ప్రజలు నిరాశ్రయులవుతారని ప్రాజెక్టులు కట్టకుండా ఉంటారా? మల్లన్నసాగర్, కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్లతో ఎవరి భూములు పోలేదా? మల్లన్నసాగర్ పరిధిలో రైతులను కొట్టి, తొక్కించి, బలవంతంగా ఖాళీ చేయించారు. కేసీఆర్ కుటుంబం ఇప్పుడు పేదలను రెచ్చగొడుతోంది… కేసీఆర్ కుటుంబ సభ్యులు ఏనాడైనా పేద ప్రజల కోసం ఏమైనా చేశారా?” అని రేవంత్ రెడ్డి నిలదీశారు. అనవసర విమర్శలు పక్కనబెట్టి, మూసీ నిర్వాసితులను ఎలా ఆదుకుందామో సలహాలు ఇవ్వండి అని విపక్షాలకు సూచించారు.