నవతెలంగాణ – హైదరాబాద్: వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని కేంద్ర బృందాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. రాష్ట్రంలో వరద నష్టం అంచనాపై సచివాలయంలో కేంద్ర బృందంతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..వరదల నివారణకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలని అన్నారు. శాశ్వత పరిష్కారానికి కార్యాచరణ ఉండాలని వివరించారు. రాష్ట్రంలో జరిగిన వరద నష్టాన్ని కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనలు లేకుండా తక్షణ సాయం నిధుల విడుదలకు విజ్ఞప్తి చేశారు. మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తే వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ రఘురాంరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు.