సీఎం రేవంత్‌ది రెండు నాల్కల ధోరణి

CM Revanth's tendency is twofold– ముఖ్యమంత్రి మాటలు నమ్మి మోసపోవద్దు : ప్రజలకు మాజీ మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి
– ఏడాది కాలంలో రైతుబంధు, బతుకమ్మ చీరెలు, పింఛన్లతోపాటు ప్రజలు అనేకం కోల్పోయారు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రతీ విషయంలోనూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ఆయన మాయ మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రేవంత్‌ పాలనలో గత ఏడాది కాలంగా రైతు బంధు, బతుకమ్మ చీరెలు, పింఛన్లతోపాటు అనేకం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల ఏడున కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జిషీటు విడుదల చేస్తామని వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు సి.లక్ష్మారెడ్డి, మహమూద్‌ అలీ తదితరులతో కలిసి హరీశ్‌రావు మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌ వ్యవహారశైలిపైనా, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపైనా ఆయన ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం ఓ అపరిచితుడంటూ ఎద్దేవా చేశారు. రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉండాలనీ, బాధ్యతగా వ్యవహరించాలని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి మాత్రం అందుకు భిన్నంగా నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుందనే రీతిలో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రూ.ఏడు లక్షల కోట్ల అప్పు చేశారంటూ సీఎం పదేపదే చెప్పటాన్ని హరీశ్‌ ఈ సందర్భంగా తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు రూ.4.26 లక్షల కోట్లేనంటూ తాను శాసనసభ వేదికగా స్పష్టం చేశానని గుర్తు చేశారు. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతు బంధు డబ్బులేసేందుకు వీలుగా తమ పార్టీ ఎలక్షన్‌ కమిషన్‌ అనుమతి తీసుకుందనీ, అదే విషయాన్ని తాను తొర్రూరులో నిర్వహించిన బహిరంగ సభలో చెప్పానని గుర్తు చేశారు. ఆ అంశంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన రేవంత్‌, ఉద్దేశపూర్వకంగానే రైతుల ఖాతాల్లో డబ్బులు పడకుండా ఆపారని వాపోయారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ సర్కారు రైతు భరోసా కింద ఎకరానికి రూ.5 వేలే ఇచ్చిందనీ, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం రూ.7,500 ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ఈ రకంగా రేవంత్‌ ప్రతీ విషయంలోనూ ద్వంద వైఖరిని ప్రదర్శిస్తున్నారని అన్నారు. ప్రజలను మోసం, దగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన భాష అత్యంత జుగుప్సాకరంగా ఉందని విమర్శించారు. ప్రజలకు మాటిస్తే నిలబెట్టుకునేందుకు ప్రయత్నించాలి, కానీ అందుకు విరుద్ధంగా సీఎం స్థాయిలో జనాలను రెచ్చగొట్టుడేందని ప్రశ్నించారు. ఆయన రెండు వైపులా పదునున్న కత్తికంటే ప్రమాదకరమని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, రైతు బంధు తదితర విషయాల్లో సీఎం రేవంత్‌ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను హరీశ్‌ ఈ సందర్భంగా ప్రదర్శించారు.

Spread the love