సీఎం సారూ…కనికరించండి

– బదిలీల కోసం స్పౌజ్‌ టీచర్ల నిరీక్షణ
– 18 నెలలుగా ఎదురుచూపులు
– 13 జిల్లాల్లో దంపతులకు తప్పని తిప్పలు
– ఖాళీలున్నా పట్టించుకోని ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో బదిలీల కోసం స్పౌజ్‌ టీచర్లు 18 నెలలుగా ఎదురుచూస్తున్నారు. 13 జిల్లాల్లోని ఉపాధ్యాయ దంపతులను ఒక చోటకు చేర్చాలని కోరుకుంటున్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సార్‌…కనికరించాలంటూ వేడుకుంటున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 20 జిల్లాల్లో ఉపాధ్యాయ దంపతుల బదిలీలను ప్రభుత్వం పూర్తి చేసింది. మిగతా 13 జిల్లాల బదిలీలను మాత్రం చేపట్టకుండా నిషేధం విధించింది. అయితే మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో గతేడాది జనవరిలో స్కూల్‌ అసిస్టెంట్‌ విభాగంలోని 615 మందికి స్పౌజ్‌ బదిలీలను చేపట్టారు. ఇంకా 1,600 మందికి స్పౌజ్‌ కోటాలో ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉన్నది. వారంతా 2022, జనవరి నుంచి అంటే 18 నెలలుగా స్పౌజ్‌ బదిలీల కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు. మంత్రులు, విద్యాశాఖ అధికారులను కలిసి విన్నవించినా, నిరసనలు, ముట్టడులు నిర్వహించినా బదిలీల సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. స్పౌజ్‌ బదిలీలు జరగకపోవడంతో మహిళా ఉపాధ్యాయుల బాధలు వర్ణనాతీతం. విద్యాసంవత్సరం ప్రారంభమైంది. దీంతో బడులకు స్పౌజ్‌ టీచర్లు హాజరవుతున్నారు. అయితే భర్త ఒకచోట, భార్య మరో చోట.. పిల్లలు మరోచోట ఉంటున్నారు. ఇక స్పౌజ్‌ టీచర్లపైనే ఆధారపడి ఉన్న తల్లిదండ్రులు మరింత ఇబ్బంది పడుతున్నారు. కుటుంబాలకు దూరంగా ఉండలేక, ఉద్యోగం చేయలేక వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ జోక్యం చేసుకుని మిగిలిపోయిన స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్జీటీ, భాషా పండితుల స్పౌజ్‌ బదిలీలను వెంటనే చేపట్టాలని కోరుతున్నారు.
జిల్లాల్లో ఖాళీలున్నా…
అన్ని జిల్లాల్లో ఉపాధ్యాయ దంపతుల బదిలీలు చేపట్టేందుకు అవసరమైన ఖాళీలు అందుబాటులో ఉన్నాయని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు సూర్యాపేట జిల్లాలో 21 మంది ఎస్జీటీలు స్పౌజ్‌ బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ జిల్లాలో సుమారు 300 ఎస్జీటీ పోస్టుల ఖాళీలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో కేవలం ఐదుగురు మాత్రమే స్పౌజ్‌ బదిలీ కోసం దరఖాస్తు చేశారు. అక్కడ వందల సంఖ్యలో ఖాళీలున్నట్టు సమాచారం. స్పౌజ్‌ బదిలీలు జరగని మిగతా జిల్లాలైన వరంగల్‌, హన్మకొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, సిద్ధిపేట, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మంచిర్యాల, ఖమ్మం జిల్లాల్లో కూడా దాదాపు ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. ఆ 13 జిల్లాల్లోని స్పౌజ్‌ బదిలీలను చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ ఎందుకు ఆసక్తి చూపడం లేదంటూ ఉపాధ్యాయ దంపతులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ జిల్లాల్లో స్పౌజ్‌ బదిలీలు చేపడితే ఉపాధ్యాయ ఖాళీలుండబోవని, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు.
మలిదశ ఉద్యమానికి సిద్ధమవుతాం : వివేక్‌
మలిదశ ఉద్యమానికి సిద్ధమవుతామని స్పౌజ్‌ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు వివేక్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. 13 జిల్లాల్లో స్పౌజ్‌ టీచర్లకు బదిలీలు చేపట్టి న్యాయం చేసేంత వరకు ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తామని వివరించారు.

Spread the love