‘జమిలి`పై క్యాబినెట్‌ నిర్ణయంపై సీఎం స్టాలిన్‌ ఫైర్‌

నవతెలంగాణ చెన్నై: జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తప్పుబట్టారు. అసాధ్యమైన, ప్రజా వ్యతిరేకమైన ‘వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌’ ప్రాంతీయ పార్టీల గొంతు అణిచివేస్తుందని మండిపడ్డారు. జమిలి ఎన్నికలు భారత సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగిస్తాయన్నారు. ఈ బిల్లును క్యాబినెట్ ఆమోదించడాన్ని క్రూరమైన చర్యగా అభివర్ణించారు. భారత ప్రజాస్వామ్యంపై జరుగుతున్న ఈ దాడిని యావత్‌ ప్రజానీకం ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు స్టాలిన్‌ ‘ ఎక్స్‌’లో పోస్టు చేశారు.
‘‘ కేంద్ర క్యాబినెట్ జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు ఆమోద ముద్రవేసింది. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాంతీయ పార్టీల గొంతు నొక్కేసేలా ఉంది. మనమంతా దీనిని ప్రతిఘటించాలి’’ అని స్టాలిన్‌ పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో జమిలి ఎన్నికల బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కీలక బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో 13,14 తేదీల్లో తప్పనిసరిగా సభకు హాజరు కావాలని తమ ఎంపీలకు బీజేపీ, కాంగ్రెస్‌లు విప్‌ జారీ చేశాయి.

Spread the love