బడిబాటను ప్రారంభించనున్న సీఎం?

Badibatan CM to start?– షెడ్యూల్‌ను సవరించనున్న విద్యాశాఖ
– 6 తర్వాత నిర్వహించే అవకాశం
– ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరిన ప్రతిపాదనలు : రేవంత్‌రెడ్డి ఆమోదించగానే అధికారికంగా వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో బడిబాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించే అవకాశమున్నది. ఈనెల మూడు నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమాన్ని చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశముండడంతో ఆ షెడ్యూల్‌లో మార్పులుంటాయని అధికారికంగా తెలుస్తున్నది. సవరణ షెడ్యూల్‌తో ప్రతిపాదనలను రూపొందించి ముఖ్యమంత్రి కార్యాలయానికి విద్యాశాఖ పంపించినట్టు విశ్వసనీయ సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదించగానే బడిబాట కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశమున్నది. ఈనెల ఆరో తేదీ వరకు పార్లమెంటు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుంది. ఆ తర్వాతే బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశమున్నది. ఇంకోవైపు ఈనెల నాలుగో తేదీ వరకు ఉష్ణోగ్రతలు 45 నుంచి 55 డిగ్రీల వరకు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు బయటకు రావొద్దంటూ కోరింది. ఎండల తీవ్రత నేపథ్యంలో ఈనెల మూడు నుంచి ప్రారంభించే బడిబాటను వాయిదా వేయాలంటూ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. 2024-25 విద్యా సంవత్సరం ఈనెల 12 నుంచి ప్రారంభం కానుంది. అదేరోజు నుంచి పాఠశాలలు పున:ప్రారంభమవుతాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చే ఆదేశాలకు అనుగునంగా బడిబాట షెడ్యూల్‌ను విద్యాశాఖ ప్రకటించే అవకాశమున్నది.

Spread the love