– వేలం జాబితా నుంచి తొలగించాలి
– హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ను పునరుద్ధరించాలి
– తెలంగాణకు 25 లక్షల ఇండ్లు మంజూరు చేయండి
– 2,450 ఎకరాల రక్షణ శాఖ భూములు కేటాయించండి
– విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను నెరవేర్చాలి : ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలని, ప్రస్తుతం వేలంలో పెట్టిన శ్రావణపల్లి బొగ్గుబ్లాక్‌ను వేలం జాబితా నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం నాడిక్కడ ప్రధానమంత్రి నివాసంలో సీఎం సుమారు గంటసేపు రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధానితో చర్చించారు. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొగ్గు గనుల కేటాయింపు, ఐటీఐఆర్ పునరుద్ధరణ, రక్షణ భూముల కేటాయింపు, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలపై ప్రధానితో చర్చించారు. ప్రభుత్వ రంగంలో ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ (ఎస్‌సీసీఎల్)లో తెలంగాణ ప్రభుత్వానికి 51 శాతం, కేంద్ర ప్రభుత్వానికి 41 శాతం వాటాలున్నట్టు ప్రధానమంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. గనులు, ఖనిజాభివృద్ధి నియంత్రణ చట్టంలోని (ఎంఎండీఆర్) సెక్షన్ 11ఏ/17 (ఏ) (2) ప్రకారం వేలం జాబితా నుంచి శ్రావణపల్లి గనిని తొలగించాలని, అదే సెక్షన్ ప్రకారం గోదావరి లోయ బొగ్గు నిల్వల క్షేత్రం పరిధిలోని కోయగూడెం, సత్తుపల్లి బ్లాక్ మూడు గనులనూ సింగరేణికే కేటాయించాలని రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి కేంద్రాల అవసరాలు తీర్చేందుకు ఈ గనుల కేటాయింపు కీలకమైనందున, సింగరేణికే వాటిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
ఐటీఐఆర్‌ను పునరుద్ధరించాలి
2010లో నాటి యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్, బెంగళూరు నగరాలకు సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్) మంజూరు చేసింది. ఐటీ రంగంలో నూతన కంపెనీలు, డెవలపర్లను ప్రోత్సహించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం మూడు క్లస్టర్లలో అందుకు అవసరమైన భూమిని గుర్తించింది. 2014 తరువాత ఐటీఐఆర్ ముందుకు సాగలేదు. హైదరాబాద్‌కు ఐటీఐఆర్ పునరుద్ధరించాలి.
ఐఐఎం ఏర్పాటు చేయాలి
వెంటనే హైదరాబాద్‌లో ఐఐఎం మంజూరు చేయాలి. ఇందుకోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో సరిపడా భూమి అందుబాటులో ఉంది. సెంట్రల్ యూనివర్సిటీలో కాకుండా మరెక్కడైనా ఐఐఎం ఏర్పాటు చేస్తామన్నా ప్రత్యామ్నాయంగా భూ కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇండియా సెమీకండక్టర్ మిషన్‌లో తెలంగాణను చేర్చాలి. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలి. రాష్ట్రానికి 24 నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలి.
కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి
రాష్ట్ర పునర్విభజన సమయంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కోచ్ తయారీ కేంద్రానికి బదులు కాజీపేటలో పీరియాడికల్ ఓవరోలింగ్ వర్క్‌షాప్ ఏర్పాటు చేస్తున్నట్లు 2023 జులైలో రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశంలోని ఇతర ప్రాంతాలకు కోచ్ ఫ్యాక్టరీలు మంజూరు చేసిన రైల్వే శాఖ కాజీపేటలో మాత్రం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ప్రకటించడం సరికాదు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలి.
25 లక్షల ఇండ్లు కేటాయించండి
ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ (పీఎంఏవై) తొలి దశలో తెలంగాణ రాష్ట్రానికి తక్కువ ఇండ్లు మంజూరయ్యాయి. 2024-25 నుంచి ప్రారంభమవుతున్న పీఎంఏవై పథకంలో మూడు కోట్ల గృహాలను లక్ష్యంగా ఎంచుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో తెలంగాణకు 25 లక్షల ఇండ్లు మంజూరు చేయాలి.
బీఆర్‌జీఎఫ్ నిధులు రూ.1,800 కోట్లివ్వండి
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బీఆర్‌జీఎఫ్) కింద కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి 2019 వరకు ఐదేండ్లలో తెలంగాణకు రూ.2,250 కోట్లు కేటాయించింది. ఒక్కో ఏడాదికి రూ.450 కోట్ల చొప్పున ఈ గ్రాంట్ మంజూరు చేశారు. 2019-20, 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాలకు సంబంధించి బీఆర్‌జీఎఫ్ కింద తెలంగాణకు రావల్సిన రూ.1,800 కోట్లు విడుదల చేయాలి.
రక్షణ శాఖ భూములను బదిలీ చేయండి
రాజధాని హైదరాబాద్‌లో పెరిగిన ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా హైదరాబాద్-కరీంనగర్ రహదారి, హైదరాబాద్- నాగ్‌పూర్ రహదారి (ఎన్‌హెచ్-44)పై ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించాలని నిర్ణయించాం. ఆ రెండు కారిడార్ల నిర్మాణానికి అడ్డంకి లేకుండా మార్గమధ్యలో రక్షణశాఖ పరిధిలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలి. ఆ కారిడార్లతో పాటు హైదరాబాద్‌లో రహదారుల విస్తరణ, రవాణా, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర రక్షణ శాఖ పరిధిలో 2,450 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలి. ఆ భూములకు ప్రత్యామ్నాయంగా రావిరాల ప్రాంతంలో రీసెర్చ్ సెంటర్ ఇమరాత్ (ఆర్‌ఐసీ) కి లీజుకు ఇచ్చిన 2,462 ఎకరాల భూములను పూర్తిగా కేంద్రానికి అప్పగించేందుకు తమ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది.
బయ్యారంలో ఉక్కు కర్మాగారం
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇప్పటికే సాధ్యాసాధ్యాల నివేదికలు సమర్పించాయి. వెంటనే ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పి ప్రక్రియను వేగవంతం చేయాలి.
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం వేగవంతం చేయాలి
భారత్‌మాల పరియోజన మొదటి దశలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగం (సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు) జాతీయ రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఆ రహదారి నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ వ్యయంలో 50 శాతం ఖర్చు చేయడంతో పాటు రహదారి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది. ఈ రహదారులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వీలైనంత తొందరగా చేపట్టాలి. హైదరాబాద్ చుట్టూ జాతీయ రహదారుల అభివృద్ధికి అత్యంత ఉపయోగంగా ఉండే ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగాన్ని (చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు) వెంటనే జాతీయ రహదారిగా గుర్తించి, వెంటనే భారత్ మాల పరియోజనలో దాని నిర్మాణం చేపట్టాలి.
జాతీయ రహదారులుగా
తెలంగాణలోని ప్రధాన పట్టణాలు, పుణ్య క్షేత్రాలకు పెరిగిన రవాణా అవసరాల దృష్ట్యా 13 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలి. జగిత్యాల-పెద్దపల్లి-కాటారం, దిండి-దేవరకొండ-మల్లెపల్లి-నల్గొండ, భువనగిరి- చిట్యాల, చౌటుప్పల్ అమన్‌గల్-షాద్ నగర్-సంగారెడ్డి, మరికల్- నారాయణపేట రామసముద్ర, వనపర్తి-కొత్తకోట-గద్వాల మంత్రాలయం, మన్నెగూడ-వికారాబాద్-తాండూరు-జహీరాబాద్-బీదర్, కరీంనగర్-సిరిసిల్ల- కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం, ఎర్రవల్లి ఎక్స్ రోడ్డు-గద్వాల-రాయచూరు, కొత్తపల్లి- హుస్నాబాద్- జనగాం- హైదరాబాద్, సారపాక- ఏటూరునాగారం, దుద్దెడ- కొమురవెల్లి-యాదగిరిగుట్ట రాయగిరి క్రాస్ రోడ్డు, జగ్గయ్యపేట- వైరా-కొత్తగూడెం రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు.