– దశాబ్దం తర్వాత బీజేపీకి తప్పనిసరైన మిత్రుల అవసరం
– టీడీపీ, జేడీయూ లేకుంటే ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యమే
– ఇది మోడీకి పరీక్షే
మూడోసారి అధికారంలోకి రావాలని తహతహలాడిన బీజేపీకి ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీయడంతో అత్తెసరు మెజారిటీని చేరుకోవ డానికి ఆపసోపాలు పడింది. దీంతో దశాబ్ద కాలం తర్వాత దేశంలో మళ్లీ సంకీర్ణ రాజకీయాలకు తెర లేచింది. 90వ దశకం ద్వితీయార్థంలో ఎన్డీఏ, యునైటెడ్ ఫ్రంట్ మధ్య సార్వత్రిక సమరం నడిచింది. ఆ తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో 16 స్థానాలు గెలుచుకున్న తెలుగుదేశం, బీహార్‌లో 14 సీట్లు సాధించిన జేడీయూ పార్టీల మద్దతు తప్పనిసరి అయింది.
న్యూఢిల్లీ : లోక్‌సభ ఫలితాల నేపథ్యంలో ఎన్డీఏ, ఇండియా కూటమి తమ తమ భాగస్వామ్య పక్షాలతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సంప్రదింపులు జరిపారు. మరోవైపు ఎన్సీపీ అధిపతి శరద్ పవార్ కూడా చంద్రబాబుతో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి.
2014లో మోడీ ప్రధాని అయినప్పుడు దేశ రాజకీయాల్లో స్పష్టమైన చిత్రం కన్పించింది. బీజేపీకి మెజారిటీ స్థానాలు లభించడంతో ప్రభుత్వ మనుగడ కోసం భాగస్వామ్య పక్షాలపై ఆధారపడాల్సిన అవసరం రాలేదు. అప్పటికే భారత్ ఎన్నో సంకీర్ణ ప్రభుత్వాలు చూసింది. చాలా ప్రభుత్వాలు అస్థిరతతో కొట్టుమిట్టాడాయి. భాగస్వామ్య పక్షాలు తరచూ విధేయతలు మార్చుకునేవి. కానీ మోడీకి ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇవ్వడంతో సంకీర్ణ రాజకీయాలకు తెర పడింది. డిమాండ్ల సాధన కోసం ప్రధానిపై మిత్రపక్షాలు ఒత్తిడి తెచ్చే రోజులు పోయాయి. యూపీఏ-2 పాలనలో సంకీర్ణ రాజకీయాలపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. విధానపరమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
మోడీ ప్రధాని అయిన తర్వాత దేశ రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. బీజేపీకి శివసేన, అకాలీలు సహా పలు పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నప్పటికీ కమలదళానికి వాటి అవసరం ఎన్నడూ రాలేదు. పైగా వాటిని తర్వాతి కాలంలో బీజేపీ వదులుకుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు అన్నా డీఎంకేతో కూడా సంబంధాలు తెంచుకుంది. ఈ పరిణామాలను చూసిన వారందరూ భారత్ ఏక పార్టీ పాలన దిశగా పయనిస్తోందని భావించారు.
రాజకీయ వాతావరణం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తగినంత మెజారిటీ రాకపోవడంతో మోడీకి తొలిసారిగా మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన అవసరం ఏర్పడింది. రాబోయేది సంకీర్ణ సర్కారేనని స్పష్టమైపోయింది. చంద్రబాబు, నితీశ్‌కుమార్ బీజేపీకే మద్దతు ఇస్తుండడంతో వారు ఇండియా బ్లాక్ వైపు వెళ్లే అవకాశాలేవీ కన్పించడం లేదు.
గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలు నడిపింది. అయితే తరచూ విధేయతలు మార్చుకునే మిత్రపక్షాలపై వాజ్‌పేయి ప్రభుత్వం ఆధారపడాల్సి వచ్చింది. ఫలితంగా పరిస్థితి దినదినగండంగా మారింది. బీజేపీ సంకీర్ణ యుగం నాటి ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ వంటి సీనియర్ నేతలు ఇప్పుడు లేరు. ఇవాళ బీజేపీలో సంకీర్ణ రాజకీయాల గురించి తెలిసిన నేతల సంఖ్య చాలా తక్కువే. వాజ్‌పేయి నేతృత్వం వహించినప్పుడు కూడా బీజేపీ బలం పడిపోయింది. 1999లో 182 స్థానాలు గెలుచుకున్న ఆ పార్టీ 2004లో 138 సీట్లకే పరిమితమైంది.
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో భారీగా నష్టపోయింది బీజేపీయే. లాభపడింది కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు. సంకీర్ణ భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జేడీయూ కారణంగానే లోక్‌సభలో బీజేపీకి ఆ స్వల్ప మెజారిటీ అయినా వచ్చింద నడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఇకపై మోడీ ఏకపక్ష విధానాలు సాగవు. సంకీర్ణ సర్కారును నడపడం మోడీకి కత్తి మీద సామేనని చెప్పక తప్పదు.