ఒకటిన్నర సంవత్సరాల శిశువుకు కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీ విజయవంతం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఒకటిన్నర సంవత్సరాల వయసు కన్నా తక్కువ వయస్సు కలిగిన శివ్‌కన్యకు చేసిన కాక్లియర్‌ ఇంప్లాంట్‌ శస్త్రచికిత్స విజయవంతమైనట్టు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతేడాది డిసెంబర్‌లో గాంధీ ఆస్పత్రి ఈఎన్‌టీ విభాగం ఆధ్వర్యంలో కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు పలు సర్జరీలు చేసిన వారిలో శివ్‌కన్యది చిన్న వయస్సు. ఆస్పత్రి పీడియాట్రిక్‌ విభాగంతో కలిసి ఈఎన్‌టీ వైద్యులు యూనివర్సల్‌ న్యూ బార్న్‌ హియరింగ్‌ స్క్రీనింగ్‌ కింద అతి చిన్న వయస్సులోనే ఈ లోపాన్ని గుర్తిస్తున్నారు. తద్వారా సాధారణ బడుల్లోనే ఇలాంటి పిల్లలు చేరేలా వారికి మాట్లాడటం, భాషను గుర్తించే పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తున్నారు. సంగారెడ్డికి చెందిన శివ్‌ కన్య శస్త్రచికిత్స విజయంతం కావడం పట్ల ఈఎన్‌టీ విభాగం అధిపతి ప్రొఫెసర్‌, డాక్టర్‌ ఎ.శోభన్‌ బాబు, అనెస్తీషియా విభాగం అధిపతి ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎ.మురళీధర్‌ వారి బృందాలకు, ఆడియాలజీ విభాగం సిబ్బంది కె.సాయి కిరణ్‌, కె.అనూషలకు సూపరింటెండెంట్‌ అభినందనలు తెలిపారు.

Spread the love