– 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్
– దాదాపు 15 వేల మంది యువతకు ఉద్యోగాలు
– అమెరికాలో సీఎంతో కాగ్నిజెంట్ ప్రతినిధుల చర్చలు సఫలం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఐటీ రంగంలో ప్రపంచస్థాయిలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ హైదరాబాద్‌లో 15 వేల మంది ఉద్యోగులకు పని కల్పించేలా కొత్త సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. ఇరవై వేల మంది ఉద్యోగులుండేలా పది లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ సెంటర్‌ను స్థాపించనుంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్, కంపెనీ ప్రతినిధుల బృందం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..ఐటీ రంగానికి మరింత అనుకూల వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని భరోసానిచ్చారు. కాగ్నిజెంట్ కంపెనీ కొత్త సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్‌ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగ్నిజెంట్ కంపెనీకి తమ ప్రభుత్వం తగినంత మద్దతిస్తుందని హామీనిచ్చారు. కొత్త సెంటర్ ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందని ఆకాంక్షించారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని టైర్-2 నగరాల్లోనూ ఐటీ సేవలను విస్తరించాలని సూచించారు. దీనికి ఆ కంపెనీ ప్రతినిధులు సానుకూలత వ్యక్తం చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రముఖ టెక్ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపు చూస్తున్నాయనీ, ఇక్కడ కొత్త కేంద్రాన్ని స్థాపించాలనే కాగ్నిజెంట్ నిర్ణయం హైదరాబాద్ వృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగ్నిజెంటర్ సీఈఓ ఎస్.రవికుమార్ మాట్లాడుతూ..టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా సత్తా చాటుకుంటున్న హైదరాబాద్‌లో తమ కంపెనీ విస్తరించటం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో నెలకొల్పే కొత్త సెంటర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు మెరుగైన సేవలం దించేందుకు ఉపయోగ పడుతుందన్నారు. ఐటీ సేవలతో పాటు కన్సల్టింగ్‌లో అత్యాధునిక పరిష్కారాలను అందిస్తుందని హామీనిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్‌తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని వివరించారు. గతేడాది ముఖ్యమంత్రి బృందం దావోస్ పర్యటన సందర్భంగానే ఈ ఒప్పందానికి పునాదులుపడ్డాయని చెప్పారు.