మోడల్ ఆస్పత్రులపై ప్రత్యేక దృష్టి అవసరం: కలెక్టర్

Model Hospitals require special attention: Collector– ఎంపిక చేసిన ఆస్పత్రులలో 15 నుండి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు 
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
విద్య, వైద్య ఆరోగ్య సంక్షేమంలో భాగంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున  ఎంపిక చేసిన మోడల్ ఆస్పత్రులలో ఈనెల 15 నుండి ప్రసవాలతోపాటు, చిన్నపిల్లల వైద్య చికిత్సలపై  ప్రత్యేక దృష్టి సారించాలని  జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం అయన కలెక్టర్ కార్యాలయం నుండి మోడల్ ఆస్పత్రు లలో వైద్య సౌకర్యాలు, జ్వర సర్వే పై జిల్లాలోని   వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 16 నుండి వారం రోజులపాటు అన్ని మున్సిపాలిటీలు, గ్రామాలలో జ్వర సర్వే నిర్వహించాలని, గ్రామీణ ప్రాంతంలో ఆశ ,అంగన్వాడి కార్యకర్తలు  సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో జ్వర సర్వే నిర్వహించాలని, సర్వేలో భాగంగా ఇంటింటికి వెళ్లి వివరాలన్నిటిని సేకరించాలని, ఎవరైనా జ్వరంతో బాధపడుతున్నట్లయితే తక్షణమే వారికి చికిత్స అందించడమే కాకుండా, వారికి నయం అయ్యేవరకు ప్రతిరోజు వివరాలు తెలుసుకుని సమర్పించాలని ఆదేశించారు. మున్సిపల్ ప్రాంతాలలో వార్డ్ అధికారి ఆధ్వర్యంలో సర్వే నిర్వహించాలి.ఈ నెల 15 నుండి ఎంపిక చేసిన దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్  ప్రభుత్వాసుపత్రులతో పాటు, నల్గొండ ప్రభుత్వ  ప్రధాన ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయిలో వైద్య  సేవలు అందించేందుకుగాను జిల్లాలో  పైలెట్ పద్ధతిన మోడల్ ఆస్పత్రులుగా ఎంపిక చేయడం జరిగిందని, ఈ ఆసుపత్రులో ఈనెల 15 నుండి పూర్తిస్థాయిలో వైద్య  సేవలు అందించే ఏర్పాటు చేయాలని ఆయన  వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.ముఖ్యంగా  24 గంటలు  గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలకు  వైద్య చికిత్సలందించడం పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని, ఈ డి డి  లో నమోదైన వివరాల ప్రకారం ప్రసవాలు నిర్వహించాలని, అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించిన చికిత్సలు సైతం ఏలాంటి పొరపాట్లు లేకుండా అందించాల్సిందిగా ఆదేశించారు.
పొరపాటులకు తావు లేకుండా వేడుకలు నిర్వహించాలి..
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపై జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ.. ఎలాంటి తప్పులకు  ఆస్కారం  ఇవ్వకుండా గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించాలని, గ్రామాలలో పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ  చేయాలని, ప్రతి గ్రామంలో, ప్రతి కార్యాలయంలో స్వతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించాలని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా జాతీయ పతాక నిబంధనలను పాటించాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్, డిసిహెచ్ఎస్ మాతృ నాయక్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, తదితరులు హాజరయ్యారు.
Spread the love