డైట్ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలి: కలెక్టర్

The diet program should be held in a festive atmosphere: Collectorనవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్, కెజిబివి పాఠశాలల్లో ఈనెల 14వ తేదీన నూతన డైట్ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలనీ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు తెలిపారు. గురువారం గురుకుల హాస్టల్ విద్యార్థుల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలఫై వివిధ శాఖల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ, కెజిబివి, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచిన నేపథ్యంలో ఈ నెల 14వ తేదీన జిల్లాలోని 85 వసతి గృహాల్లో నూతన డైట్ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం గురుకుల హాస్టల్ విద్యార్థులకు 40 శాతం డైట్ చార్జీలను పెంచిందన్నారు. అదేవిధంగా 16 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం కాస్మోటిక్ చార్జీలను 200% పెంచిందని పేర్కొన్నారు. గురుకుల విద్యార్థుల కోసం పౌష్టిక ఆహారాన్ని అందిస్తుందన్నారు. విద్యార్థుల తల్లులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వారి సమక్షంలో వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించాలన్నారు. ప్రజా ప్రతినిధులను ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించాలని సూచించారు. వంట శాలలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు కార్యక్రమ ప్రత్యేక అధికారులుగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రిన్సిపాల్స్ పిల్లల తల్లి తండ్రులకు సమాచారం ఇచ్చి ఆహ్వానించాలని ఆదేశించారు. ప్రముఖులు వస్తారని లోటు పాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. భోజనం క్వాలిటీ, క్వాంటిటీ పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా తల్లులకు వారి పిల్లల ఆహార అలవాట్లపై అవగాహన కల్పించడం, పౌష్టికాహారంపై శ్రద్ధ పెంచడం ప్రధాన ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు. అందుకే ఈ పండుగను పాఠశాలలలోనే కాకుండా విద్యార్థుల కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా పాల్గొనేలా నిర్వహించాలని సూచించారు. ఏమి మెనూ ఇస్తున్నామో తల్లితండ్రులకు తెలియాలని, ఆ క్రమంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అంతర్జాతీయ విద్య ప్రమాణాలతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. గురుకుల హాస్టల్ విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా, జోనల్, మండల స్థాయి అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్,మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపిడి ఓ లు, సంబంధిత శాఖల అధికారులు వున్నారు.
Spread the love