ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని జలగలంచ గుత్తి కోయ గూడెం న్ని శుక్రవారం ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ సందర్శించారు. గత రెండు రోజుల క్రితం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జలగలంచ గుత్తి కోయ ఆదివాసులకు త్రాగు నీరు, కరెంటు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం అందజేశారు. దీనికి స్పందించిన కలెక్టర్ దివాకర టిఎస్ గూడాన్ని సందర్శించి, ఆదివాసి గిరిజనులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్రాగడానికి మిషన్ భగీరథ నీళ్లు సౌకర్యం ఏర్పాటు చేస్తామని, కరెంటు సౌకర్యం ఏర్పాటు చేస్తామని గుత్తికాయ ఆదివాసీలకు హామీ ఇచ్చారు. అక్కడ ఆర్డీటి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘బడి’ ని సందర్శించి మాట్లాడారు. అంగన్వాడి టీచర్ ను, లబ్ధిదారులను పిలిచి అన్ని రకాల సరుకులు ఇస్తున్నారా ? అని అడిగి తెలుసుకున్నారు. ఇస్తున్నారని వారు బదులిచ్చారు. జలగలంచ గుత్తి కోయ ఆదివాసీల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఏ సమస్య ఉన్న అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో సీసీ నాగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రత్నం రాజేందర్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి గొంది రాజేష్, పల్లపు రాజు, ఆదివాసి గిరిజనులు రాము, రమేష్, హుంగయ్య, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.