నవతెలంగాణ-నిర్మల్
కడెం మండలం కొత్త మద్ధిపడగ గ్రామంలో పునరావాసితులైన మైసంపేట్, రాంపూర్ గ్రామాల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్ అభిలాష అభినవ్ హామీ ఇచ్చారు. సోమవారం కలెక్టరెట్ సమావేశ మందిరంలో ఆయా శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో గ్రామస్థులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పునరావాస గ్రామస్తులకు నష్టపరిహారం కింద ఇచ్చిన భూములను రక్షించుకోవాలని, భూములను అమ్మడం, తనఖా పెట్టడం చెల్లదని తెలిపారు. భూముల చదును చేసేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ వర్షాకాలం నుంచే వ్యవసాయం సాగు మొదలు పెట్టాలని అన్నారు. బ్యాంకు రుణాలకు సంబంధించి బ్యాంకర్లతో మాట్లాడి రుణాలు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా తెరిపిస్తమన్నారు. ఎటువంటి సమస్యలు, సందేహాలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అధికారులంతా పునరావాస ప్రజలకు తోడ్పాటును అందించాలన్నారు. ప్రజలందరికీ విద్యా, వైద్యం, పారిశుధ్యం వంటి అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, అటవీ అధికారి ప్రసాద్, ఆర్డీవో రత్నకళ్యాణి, జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, డీఆర్డీవో విజయలక్మి, డీఈవో రవీందర్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ ధన్‌రాజ్, డీడబ్ల్యూవో నాగమణి పాల్గొన్నారు.