మనం బాటసారులమై
మన పనిమీద మనం నడిచెల్లిపోతుంటే
తెల్లబట్టగప్పుకొని సెండుపూల పరుపుపై
శవాన్ని నల్గురు మోసుకొస్తుంటే
ఓ కన్నీటి చుక్క రాల్చకపోతే
అప్పటికప్పుడే మనలో మనం శవమైనట్లే.
ఊరిలో చివరి గుడిసె కాలిపోతే
కొంగు అడ్డం పెట్టుకోకుండా
బాహాటంగా ఏడుస్తున్న ఆ అమ్మ దుఃఖానికి
నేను కూడా కారణమే కదా అనీ
తననీ తాను నిందితుడిగా ప్రకటించుకోనోడు
మనిషిగా ఎప్పటికీ మనిషి కాలేడు.
నువ్వు మూడు పూటల బువ్వతిని
మెతుకుల కోసం చేసే పోరులో
నీ పిడికిలొక్కటి లేయకపోతే
ఈ సమాజమంత గుర్తుపెట్టుకునే
ఉద్యమ ద్రోహివి నువ్వే.
రాత్రి కురిసిన వాన వరదగా మారి
ఊరు ఊరంత పీకలోతు మునిగిపోతే
నీవు దాసుకున్న బియ్యం గింజలను
ఓ మూటగట్టి శరణార్ధుల శిబిరానికి
తీసుకెళ్లకపోతే
ఆ వరద నీటిలో మునిగిపోయే
రేపటి పక్షివి నువ్వే ఐతావు.
నడిరోడ్డు మీద
ప్రాణం గిలగిల కొట్టుకుంటుంటే
దోసిట్లో నీళ్ళుదెచ్చి నోట్లో పోయకుండా
రక్తం మరకలు బట్టలకు అంటుతాయని
చూస్తూ ఉండిపోయిన
మనిషిని మనిషిగా పిలవకూడదు.
అన్యాలమని తెలిసి కూడా
వందమందిలో నీ నోరు
బాధితుడి వైపు పెగలకపోతే
నీలోని గడ్డకట్టుకపోయిన పిరికితనం
ఒకనాడు పదిమంది చూస్తుండగా
నిన్ను కాల్చుక తింటది చూడు..
ఆపతొచ్చినప్పుడు
మనిషి గొప్ప మనిషిగా మారాలి
సమయం వచ్చినప్పుడు
మరొక మనిషిలోకి మనం జొరబడి
మానవత్వపు దన్నెడగట్టి
నీ దిగాలుతనాన్ని అరేసుకోవాలి.
– అవనిశ్రీ, 9985419424