– అభివృద్ధిలో భాగస్వాములుకండి
– తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు సీఎం రేవంత్ పిలుపు
– తమ ప్రభుత్వంపై అపోహలు, ఆందోళనలు అవసరం లేదని వ్యాఖ్య
– ఆర్థిక వృద్ధిని వేగంగా సాధించే విధంగా
– నూతన పారిశ్రామిక విధానం తెస్తామని వెల్లడి
– న్యూజెర్సీలో ప్రవాసుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న సీఎం
– అభివృద్ధిలో భాగస్వాములుకండి : తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు సీఎం రేవంత్ పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘అమెరికాకు ఆయువుపట్టు మీరే.. ఇక తెలంగాణకు రండి, ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, తద్వారా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుకండి…’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని ఆయన వారిని కోరారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఆదివారం నిర్వహించిన ప్రవాసుల ఆత్మీయ సమ్మేళానికి సీఎం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలొచ్చిన తెలుగువారు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘తెలంగాణ మీ జన్మభూమి, మీ దేశంలో మీరు పెట్టిన ప్రతి పెట్టుబడికి తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. అంతకు మించిన అత్యుత్తమ ప్రతిఫలం ఉంటుంది. మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకుంటే అంతకు మించిన సంతృప్తి బోనస్‌గా లభిస్తుంది…’ అని వ్యాఖ్యానించారు. గతేడాది టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో తాను అమెరికాకు వచ్చానని రేవంత్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పదేండ్లపాటు సాగిన దుష్పరిపాలనకు, విధ్వంసాలకు విముక్తి పలికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మళ్లీ వస్తానంటూ తాను ఆనాడు చెప్పానని వివరించారు. ఇచ్చిన మాట ప్రకారం అమెరికాకు వచ్చానని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందంటూ సీఎం పునరుద్ఘాటించారు. ఇప్పటికే రైతులు, మహిళలు, యువకుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టామని అన్నారు. రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీతో పాటు, ఇన్పుట్ సబ్సిడీగా రైతు భరోసా, నిరుద్యోగులకు ఉద్యోగాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు వంట గ్యాస్ సిలిండర్, నిరుపేదలకు 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్తు, ఉపాధ్యాయులకు పదోన్నతులు, విద్యార్థులకు నాణ్యమైన విద్య తదితర పథకాలను అమలు చేశామని వివరించారు. ఇది ప్రారంభం మాత్రమేననీ, భవిష్యత్తులో మరిన్ని ప్రణాళికలతో తమ ప్రభుత్వం ముందుకెళుతుందని భరోసానిచ్చారు.
తమ పరిపాలనపై అపోహలు, ఆందోళనలు అవసరం లేదని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమ్మిళిత ఆర్థిక వృద్ధిని వేగంగా సాధించేందుకు వీలుగా తమ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకు రానుందని ఆయన వెల్లడించారు. నిధుల సమీకరణతోపాటు ఎక్కువ మందికి ఉపాధి కల్పన, నైపుణ్యాల వృద్ధికి అందులో సమాన ప్రాధాన్యతనిస్తామని తెలిపారు.
మాపై ఎంతో విషప్రచారం
‘ఎన్నికలకు ముందు మాపై ఎంతో విష ప్రచారం చేశారు. గిట్టని వాళ్లందరూ కాంగ్రెస్ అసలు అధికారంలోకే రాదంటూ ఎగతాళి చేశారు. వచ్చినా అది ఉండనే ఉండదంటూ జోకులు వేసుకున్నారు. ఇప్పుడేమో రాష్ట్రంలో అభివృద్ధి మందగిస్తోందంటూ లేనిపోని అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వాళ్లకు తగిన బుద్ధి చెప్పాం. అబద్ధాలకోరుల మాటలు తప్పని మరోసారి నిరూపిస్తాం. హైదరాబాద్‌ను భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా అభివృద్ధి చేసే విషయంలో పోటీ పడతాం…’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. ‘మీ నైపుణ్యాలు, ప్రతిభా పాటవాలతో అమెరికాను పటిష్టంగా, సంపన్నంగా మార్చారు. ఇకపై తెలంగాణకు మీ సేవలు అందించండి, మన రాష్ట్రాన్ని మెట్రో కోర్ అర్బన్‌తోపాటు, సెమీ అర్బన్, రూరల్ క్లస్టర్లుగా విభజించి పెట్టుబడులకు ప్రత్యేకమైన వ్యవస్థలను రూపొందిస్తాం…’
అని సీఎం ఈ సందర్భంగా తెలిపారు.
ప్రశంసలు.. అభినందనలు…
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ చేస్తున్న కృషిని అక్కడి తెలుగువారు ఈ సందర్భంగా ప్రశంసించారు. హైదరాబాద్ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలను కూడా వారు అడిగి తెలుసుకు న్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనే ప్రభుత్వ ఆలోచనతో కలిసి వస్తామని హామీనిచ్చారు. సీఎంకు స్వాగతం పలికిన ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ అమెరికా అధ్యక్షుడు మొహిందర్ సింగ్ గిల్జియాన్ మాట్లాడుతూ.. ‘మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలన్న మా కోరిక నెరవేరింది. ఇప్పుడు రాహుల్ గాంధీని భారత ప్రధానిని చేయటానికి మనమందరం కష్టపడాలి…’ అని అన్నారు. సాఫ్ట్వేర్, ఫార్మా, వ్యాక్సిన్లు, హెల్త్‌కేర్, అర్టిఫిషియల్ రంగాలకు తెలంగాణ బలమైన స్థావరంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అంతకుముందు తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే పాటలు, నృత్యాలతో కూడిన చిన్నారుల భారీ ప్రదర్శన ఆకట్టుకుంది.
పలువురు ముఖ్యులతో భేటీ
ఈ సందర్భంగా అమెరికాలోని ఈస్ట్ కోస్ట్ ఇండియన్ కమ్యూనిటీకి చెందిన పలువురు ముఖ్యులతో సీఎం భేటీ అయ్యారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నట్టు ఆయన వారితో చెప్పారు. ప్రపంచస్థాయి మాస్టర్ ప్లాన్‌తో హైదరాబాద్‌ను అత్యున్నత స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. హైదరాబాద్ అభివృద్ధికి అందరూ కలిసి రావాలని ప్రవాసులకు సీఎం పిలుపునిచ్చారు.