కమాండో శిక్షకుడు భాటియా మృతి

– డీజీపీ ప్రగాఢ సంతాపం
నవతెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి
యాంటీ నక్సలైట్‌ విభాగం గ్రేహౌండ్స్‌లో సుదీర్ఘ కాలం కమాండో శిక్షకుడిగా పని చేసిన ఐజీ భాటియా మంగళవారం మృతి చెందారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాల అణచివేతలో కీలక పాత్ర వహిస్తున్న గ్రేహౌండ్స్‌ విభాగంలో గత 30 ఏండ్లుగా అసాల్ట్‌ కమాండర్‌గా, స్క్వాడ్రన్‌ కమాండర్‌గా పని చేసి అంచెలంచెలుగా ఐజీ స్థాయికి చేరుకున్నారు. ముఖ్యంగా కానిస్టేబుళ్లు మొదలుకొని ఐపీఎస్‌ అధికారుల వరకు దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టులను ఎదుర్కోవటంలో ఆయన కఠినమైన శిక్షణను ఇచ్చి పోలీసు శాఖలోనే కఠిన శిక్షకుడిగా పేరు పొందారు. ముఖ్యంగా, జాతీయ స్థాయిలో గ్రేహౌండ్స్‌ విభాగాన్ని అగ్రస్థానంలో ఉంచటంలో ఆయన పాత్ర అత్యంత కీలకమైందని అధికారులు తెలిపారు.
ఏదో కొంత కాలం తప్పించి ప్రతి రోజు గ్రేహౌండ్స్‌ యూనిట్‌కు హాజరయ్యేవారనీ, అంకితభావం, పట్టుదలతో పని చేసేవారని ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ అన్నారు. ఆయన లేని లోటు పోలీసు శాఖలో తీర్చలేనిదని చెబుతూ ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అధికార లాంఛనాలతో బుధవారం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు. డీజీపీతో పాటు గ్రేహౌండ్స్‌ అదనపు డీజీ విజరు కుమార్‌, పలువురు సీనియర్‌ పోలీసు అధికారులు కూడా ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

Spread the love