– వివేక్ రాజీనామాతో పెండింగ్‌లో బీజేపీ మ్యానిఫెస్టో
– హ్యాండిచ్చిన స్క్రీనింగ్ కమిటీ చైర్మెన్ రాజగోపాల్ రెడ్డి
– ఎలక్షన్స్ ఇష్యూస్ కన్వీనరూ అదే పార్టీలోకి
– ప్రభావిత కమిటీ చైర్మెనే దిక్కులు చూస్తున్న వైనం
– గవర్నర్‌గా వెళ్లిపోయిన సమన్వయ కమిటీ చైర్మెన్
ఎన్నికల మేనేజ్మెంట్లో భాగంగా బీజేపీ వేసిన 14 కమిటీలు ఉత్సవ విగ్రహాలుగా మారుతున్నాయి. కమిటీల చైర్మెన్లు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి రాంరాం చెప్పేస్తున్నారు. మ్యానిఫెస్టో, స్క్రీనింగ్ కమిటీల చైర్మెన్లు, ఎలక్షన్స్ ఇష్యూస్ కమిటీ కన్వీనర్ కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ప్రభుత్వ విధానాలను ఎత్తిచూపేందుకు వేసిన పోరాటాల కమిటీ చైర్మెన్ విజయశాంతి సొంత పార్టీపైనే బాణాలు ఎక్కుపెడుతున్నారు. నేడో, రేపో ఆమె కూడా హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్టు చర్చ నడుస్తున్నది. ఇతర పార్టీల నేతలను ప్రభావితం చేసేందుకు వేసిన ప్రభావిత కమిటీ చైర్మెన్ కూడా పక్కపార్టీ వైపు చూస్తున్న పరిస్థితి నెలకొంది. పోల్ మేనేజ్మెంట్, ఎన్నికల వ్యూహాలు తెలిసిన కీలకమైన కమిటీల చైర్మెన్లంతా కాంగ్రెస్ గూటికి చేరుతుండటం ఇప్పుడు బీజేపీని కలవరపెడుతున్నది. అదే సమయంలో పార్టీలో నేతల మధ్య వైరుధ్యాలను తగ్గించడంలో భాగంగా వేసిన సమన్వయ కమిటీ చైర్మెన్ నల్లు ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్‌గా వెళ్లిపోయారు. దీంతో నేతల మధ్య సమన్వయమే కొరవడుతున్నది. చైర్మెన్లకు సపోర్టుగా వేసిన కో-కన్వీనర్లు తమ నియోజకవర్గాలకే పరిమితమై పనిచేసుకుంటున్న పరిస్థితి. దీనిని బట్టే ఎన్నికల ముందే బీజేపీ చేతులెత్తేసినట్టు కనిపిస్తున్నది.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పార్టీ నుంచి ఆయా స్థానాల నుంచి అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి షార్ట్ లిస్టు తయారు చేయడంలో స్క్రీనింగ్ కమిటీది కీలక పాత్ర. అలాంటి ముఖ్యమైన బాధ్యతను బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి బీజేపీ కట్టబెట్టింది. ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూసి ఆయన అటువైపే చూడలేదు. బీఆర్ఎస్కు బీజేపీ వంతపాడుతున్నదని ఆరోపిస్తూ ఆ పార్టీనే వీడారు. ఎటూపాలుపోని స్థితిలో కిషన్‌రెడ్డి, మరో ఇద్దరు ముగ్గురు నేతలను పట్టుకుని పని కానిచ్చేశారు. అభ్యర్థుల తుది ఎంపిక జాప్యం కావడానికి ఇదీ ఒక కారణమైందనీ, హడావిడిగా షార్ట్ లిస్టు చేయడంతో అనేక పొరపాట్లు జరిగాయని ఆ పార్టీ కీలక నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. కిషన్‌రెడ్డి, రాజేందర్, సంజరు, లక్ష్మణ్ తమకు నచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శా ఉంది. అయితే, ఆ నేతల మధ్యా భేదాభిప్రాయాలున్న సీట్లను మాత్రం పక్కన బెట్టినట్టు తెలిసింది. ఎస్సీ నియోజకవర్గాల కోఆర్డినేషన్ కమిటీ చైర్మెన్‌గా జితేందర్ రెడ్డి ఉన్నారు. తన కొడుకు గెలుపు కోసం ఆయన పాలమూరు నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఎస్సీ నియోజకవర్గాల్లో ఆ పార్టీకి పోటీ చేసే అభ్యర్థులే దొరక్కపోవడాన్ని చూస్తేనే ఆ కమిటీ పనితీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మ్యానిఫెస్టో ఎలా?
ఏ పార్టీ అయినా ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామనే వివరిస్తూ రూపొందించేదే మ్యానిఫెస్టో. ప్రత్యర్థి పార్టీలకు ఊహకందని..ప్రజల్ని ఆకర్షించే అంశాలని అందులో చేర్చడం పరిపాటి. బీజేపీ మ్యానిఫెస్టో రూపకల్పన చైర్మెన్‌గా వివేక్‌ను నియమించారేగానీ ఆయనకు స్వేచ్ఛ ఇవ్వలేదనే విమర్శ ఉంది. అదే సమయంలో బీజేపీ లోపాయికారిగా బీఆర్ఎస్కు వంత పాడుతుందనే ప్రచారం జోరందుకోవడం, టికెట్ల కేటాయింపులో జరుగుతున్న పరిణామాలను చూసి వివేక్ జీర్ణించుకోలేకపోయారు. రెండు సార్లు రాజకీయంగా తనను నమ్మించి మోసం చేసిన కేసీఆర్ పార్టీని ఓడగొట్టడమే లక్ష్యంతో ఆయన బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ పార్టీలో ఉంటే తన లక్ష్యం నెరవేరదని గ్రహించి ‘భూమి గుండ్రంగా తిరుగును’ అనే రీతిలో ఆరేండ్లలో ఆరుసార్లు పార్టీలు మారి తిరిగి సొంత గూటికే(హస్తం పార్టీకి) చేరారు. ఆయన వెళ్లిపోవడం, ఆయన సహకారిగా ఉన్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సైతం సైలెంట్‌గా ఉంటుండటంతో మ్యానిఫెస్టో రూపకల్పన చేయడం బీజేపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. మీరూ వద్దు..మీ పదవులూ వద్దు అంటూ ఎలక్షన్ ఇష్యూస్ కమిటీ కన్వీనర్ పోస్టుకు కపిలవాయి దిలీప్‌కుమార్ రాంరాం చెప్పేశారు.బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
పనిలో లేని రాష్ట్ర కేంద్రం సమన్వయ కమిటీ
ఎన్నికల వేళ నాయకులందర్నీ సమన్వయ పరిచేందుకు, జాతీయ, రాష్ట్ర నేతల మధ్య కో-ఆర్డినేషన్ ఉండేలా చేసేందుకు బీజేపీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర కేంద్రం సమన్వయ కమిటీ చైర్మెన్‌గా నల్లు ఇంద్రసేనారెడ్డిని నియమించింది. కానీ, ఎన్నికల సమయంలో పార్టీకి దూరమవుతున్న రెడ్డి సామాజిక తరగతి వారి ఓట్లను ఆకర్షించే పనిలో భాగంగా కేంద్ర నాయకత్వం ఆయనకు గవర్నర్ పదవిని కట్టబెట్టింది. త్రిపుర రాష్ట్రానికి పంపించింది. దీంతో రాష్ట్ర కేంద్రంలో సమన్వయం కరువైంది. రాష్ట్ర ఆఫీసులో టికెట్లు దక్కని నేతలు ఆందోళన చేస్తున్నా పట్టించుకోని వైనం స్పష్టంగా కనిపిస్తున్నది. వారే నాలుగైదు గంటలు ఆందోళన చేసి ఎంత మెత్తుకున్నా వీరితో ప్రయోజనం ఉండదని గ్రహించి అసంతృప్తితో తిరుగుబాట పడుతున్నారు. సమన్వయ కమిటీ పనిలో లేకపోవడం సమస్యగా మారింది.
పోరాటాల్లేవు.. తీవ్రమవుతున్న నిరసనలు
రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎత్తిచూపుతూ ఎన్నికల వేళ పోరాటాల ద్వారా ప్రజల్ని ఆకర్షించే పనిని బీజేపీ రాష్ట్ర నాయకత్వం విజయశాంతికి అప్పగించింది. పోరాట కమిటీకి ఆమెను చైర్మెన్‌గా నియమించింది. ఆ పదవి కట్టబెట్టినప్పటి నుంచి ఆమె బీజేపీ ఆఫీసు మొహమే చూడట్లేదు. పైగా, బీజేపీ నేతల తీరుపై విమర్శలు ఎక్కుపెట్టేలా ఎక్స్(ట్విట్టర్)లో పోస్టులు పెడుతున్నది. ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే చర్చ నడుస్తున్నది. బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే పోరాటాలు జరగట్లేదు గానీ టికెట్లు దక్కని నేతలు రాష్ట్ర కార్యాలయం వద్ద రోజుకొకరు నిరసనలకు దిగుతున్నారు. ఇలా నేతలు పార్టీ మారడంతో ఖాళీ అయిన స్థానాల్లో కొత్త వారిని నియమిస్తారా? లేక అలాగే ఎన్నికలకు వెళ్తారా? అనేది అంతుచిక్కడంలేదు.