– ప్రవేశపెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం
– తొలుత హైదరాబాద్ నగరంలోనే
– ఆర్టీసీ బస్సులు, మెట్రోరైల్, ఎంఎంటీఎస్, క్యాబ్స్, ఆటోలను వాడుకునే సౌకర్యం
– ఆగస్టు రెండోవారంలోగా ప్రారంభించేందుకు కార్యాచరణ
– అధికారుల సమావేశంలో మంత్రుల ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ నగరంలోని ప్రజా రవాణా వ్యవస్థ మొత్తానికి కలిపి ఉపయుక్తంగా ఉండేలా ఒక కామన్ మెబిలిటీ కార్డుని తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఇందులో భాగంగా ఇప్పటికే హైదరాబాద్ మెట్రోరైల్, ఆర్టీసీ సంస్ధలు కార్యాచరణ ప్రారంభించాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ప్రధానమైన ప్రజా రవాణా మార్గాలుగా ఉన్న మెట్రోరైల్, ఆర్టీసీ బస్సులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాడుకునేందుకు వీలుండేలా ఈ కార్డును తయారు చేయనున్నారు. మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజరుకుమార్, శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో సచివాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆర్టీసీ, మెట్రోరైల్ సంస్థల ఉన్నతాధికారులు ఈ కార్డుకు సంబంధించిన పలు వివరాలను అందించారు. కార్డు జారీ ప్రక్రియ నుంచి మొదలుకుని వివిధ ప్రాంతాల్లో దాని ఉపయోగం వరకు నగర ప్రజలకు అందుబాటులో ఉండే సేవల వివరాలను వారు వివరించారు. మొదట మెట్రోరైల్, ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి వీలుగా ఈ కార్డుని జారీ చేస్తామని, ఇదే కార్డుతో సమీప భవిష్యత్తులో ఎంఎంటీఎస్, క్యాబ్‌సేవలు, ఆటోలను కూడా వినియోగించుకునేలా విస్తరిస్తామని మంత్రులు తెలిపారు. ఇదే కార్డుతో భవిష్యత్తులో పౌరులు తమ ఇతర కార్డుల మాదిరే కొనుగోళ్లకు కూడా వినియోగించేలా వన్ కార్డ్ ఫర్ అల్‌నీడ్స్ మాదిరి ఉండాలని మంత్రులు అధికారులకు సూచించారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా హైదరాబాద్ నగరం వరకు ఈ కార్డును జారీ చేస్తామనీ, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్డు సేవలు అందించేలా విస్తరించడం లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులను మంత్రులు అదేశించారు. ఈ కార్డు కలిగిన పౌరులు దేశవ్యాప్తంగా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు వినియోగించేందుకు అవకాశం ఉన్న ప్రతి చోటా వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందని మంత్రులు తెలిపారు. దీంతో ప్రభుత్వం జారీ చేస్తున్న ఈ కార్డుతో ఇతర మెట్రో నగరాలకు వెళ్ళినప్పుడు అక్కడి ఆర్టీసీ బస్సులు, మెట్రోరైల్ ఇతర ప్రజా రవాణా వ్యవస్థను ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాడుకునేందుకు అవకాశముందన్నారు. ఈ కార్డును ప్రయోగాత్మకంగా ఆగస్టు రెండో వారంలోగా నగర పౌరులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలని మంత్రులు ఆదేశించారు. ఇందుకు సంబంధించి మెట్రోరైల్, ఆర్టీసీ సంస్థ అధికారులు సమన్వయంతో వేగంగా ముందుకు పోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయనున్న ఈ కామన్ మొబిలిటీ కార్డుకి ఒక పేరును సూచించాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ పౌరుల నుంచి పేర్లను సూచించాలని కోరుతూ ట్వీట్ చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.