– ప్రభుత్వాలపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి
– భూ పోరాటాలు ఉధృతం చేయాలి
– వార్షికోత్సవ సభలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య
నవతెలంగాణ-మహాబూబాబాద్
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం సామాజిక వివక్ష అణిచివేత మీద సమైక్య పోరాటమే వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట మని, ఆ పోరాటానికి కమ్యూనిస్టులే వారసులని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా భూ పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లాలోని పెరుమాండ్ల జగన్నాథ భవన్‌లో పార్టీ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభలో ఆయన మాట్లాడారు. నిజాం పాలనలో దోపిడీకి వ్యతిరేకంగా 1946 సెప్టెంబర్ 11 నుంచి 1951 అక్టోబర్ 21 వరకు ఐదేండ్లపాటు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగిందని అన్నారు. ప్రపంచ చరిత్రలోనే సువర్ణాక్ష రాలతో లిఖించదగిన పోరాటమని తెలిపారు. గ్రామాల్లో వెట్టిచాకిరికి వ్యతిరేకంగా భూస్వాములు, జమీందా రులు, దేశ్‌ముఖ్‌ల దోపిడీకి వ్యతిరేకంగా మొదలైన ఈ పోరాటం.. నిజం రాచరిక నిరంకుశ పాలన మీద తిరుగుబాటుగా మారిందని అన్నారు. పెత్తందారులకు వ్యతిరేకంగా ఊరంతా ఏకమై తిరగబ డటం పోరాటం ప్రత్యేకత అని తెలి పారు.1951లో భారత దేశంలో తెలం గాణ విలీనం తర్వాత కూడా పటేల్ సైన్యా లకు ఈ రజాకార్లు సహకరించారని, సైన్యంతో పాటు రైతాంగం మీద దాడులు చేశారని గుర్తుచేశారు. 1945లో భూస్వామ్య గూండాలు మహమ్మద్ బందగిని హత్య చేశారన్నారు. 1946లో విసునూరు రామచంద్రారెడ్డి, దేశ్‌ముఖ్‌ల గుండాల అరాచకాలను ఐలమ్మ తిప్పి కొట్టిందని, 1946 జులై 4వ తేదీన దేశ్‌ముఖ్ గుండాల కాల్పుల్లో దొడ్డి కొమురయ్య అమరుడయ్యారని గుర్తుచేశారు. దాంతో 1946 సెప్టెంబర్ 11న కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిందని తెలిపారు. ఈ పోరాటం మూడు వేల గ్రామాల్లో విస్తరించిందని, 4000 మంది వీరమరణం పొంది 10 లక్షల ఎకరాల భూమిని రైతులు స్వాధీనం చేసుకున్నారని అన్నారు. ఎర్రజెండా నాయకత్వంలో సాయుధ రైతాంగ తిరుగుబాటు జరిగి ఉండకపోతే 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యే పరిస్థితి ఉండేది కాదని అన్నారు. తెలంగాణ విలీనం ఎర్రజెండా విజయమని స్పష్టం చేశారు. నాటి పోరాట ఫలితంగానే తెలంగాణలో ఉద్యమాలు కొనసాగుతున్నాయని అన్నారు. కమ్యూనిస్టు పోరాటాల ఫలితంగానే తెలంగాణలో ఎన్నో లక్షల మంది పేదలకు ఇండ్ల స్థలాలు, సాగు భూములు దక్కాయని చెప్పారు. ఈ పోరాటస్ఫూర్తితో తెలంగాణలో ఉవ్వె త్తున జరుగుతున్న గుడిసెల పోరాటాల మూలంగా పాలకులు దిగి వస్తున్నారని అన్నారు. దేశంలో పేదరికం, నిరుద్యోగం పెరిగిపోతుం దని, దాంతో పాలకులపై ప్రజల్లో అసంతృప్తి తీవ్రంగా ఉందని అన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి.. భూ పంపిణీ చేయాలని, దళిత, గిరిజనులకు ఇందిరమ్మ గృహ పంపిణీ పథకం కింద రూ.6 లక్షలు, బీసీలకు రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోరాటాల ద్వారానే హక్కులు సాధించుకోవాలని, భూములు పొందాలని పిలుపునిచ్చారు. ఈ సభలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు గునిగంటి రాజన్న, సమ్మెట రాజమౌళి, అల్లి శ్రీనివాస్ రెడ్డి, రావుల రాజు, తోట శ్రీను, నక్క సైదులు, కందునూరి శ్రీను, హేమనాయక్, కుమ్మరి కుంట్ల నాగన్న, భానోత్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.