కమ్యూనిస్టులు చరిత్ర సృష్టికర్తలు

Communists are history makers– మోడీ హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం
– రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఖూనీ
– ‘ఇండియా’ కూటమితో బీజేపీలో గుబులు : సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారతదేశ చరిత్ర సృష్టికర్తలు కమ్యూనిస్టులే…అదే వారి గుర్తింపు అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా అన్నారు. చరిత్రను అబద్ధాలతో వక్రీకరిస్తూ, తిరగరాయాలని చూస్తే ప్రజలు సహించబోరని హెచ్చరించారు. తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం కమ్యూనిస్టులదేనని స్పష్టం చేశారు. దేశ స్వాతంత్య్ర పోరాటం సహా దేనితోనూ సంబంధం లేని బీజేపీ, బీఆర్‌ఎస్‌ సహా అనేక పార్టీలు రకరకాల పేర్లతో సాయుధ పోరాట ఉత్సవాలను నిర్వహిస్తున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 4,500 మంది బలిదానాలు చేస్తేనే, హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యిందని గుర్తుచేశారు. సీపీఐ రాష్ట్ర సమితి అధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభ ఆదివారంనాడిక్కడి నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరిగింది. దీనికాయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. భారత స్వాతంత్రోద్యమం, తెలంగాణ సాయుధ పోరాటాల్లో జనసంఫ్‌ు, ఆర్‌ఎస్‌ఎస్‌, సంఫ్‌ుపరివార్‌ శక్తుల పాత్ర ఏంటని ప్రశ్నించారు. వారికి అసలు వాటితో ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతున్నాయని విమర్శించారు. కమ్యూనిస్టులు ప్రజల ఐక్యతను కోరితే… బీజేపీ, మోడీషాలు మతం పేరుతో వారిమధ్య విభజన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. జీ-20 సమావేశాల తర్వాత ప్రధాని మోడీ అంతర్జాతీయంగా బలమైన నాయకుడిగా మారారని సంఫ్‌ుపరివార్‌ ప్రచారం చేస్తున్నదనీ, కానీ ఆ సమావేశాల తర్వాత భారతదేశ రూపాయి విలువ మరింత దిగజారిందని గుర్తుచేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనావస్థలో ఉందనీ, ఎన్నికల టైంలో ప్రధాని ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని గుర్తుచేశారు. అదానీ, అంబానీ, కార్పొరేట్ల ఆస్తులు పెరిగాయే తప్ప, సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మరింత దిగజారాయని వివరించారు. దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కనుచూపు మేరలో లేవనీ, మహిళలు, దళితులు, ఆదివాసీలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్‌లో పౌరయుద్ధం ప్రజల మధ్య జరుగుతున్నదనీ, అక్కడి డబుల్‌ ఇంజిన్‌ సర్కారు వాటిని నియంత్రించడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. గవర్నర్ల వ్యవస్థతో ప్రతిపక్షపార్టీల ప్రభుత్వాలపై పెత్తనం చేస్తున్నారని అన్నారు. దేశంలోని పరిస్థితులకు రాజకీయ ప్రత్యామ్నాయంగా ‘దేశ్‌ కో బచావ్‌-బీజేపీ హఠావ్‌’ నినాదంతో ‘ఇండియా’ కూటమి ఏర్పడితే, దాన్ని చూసి భయపడి, చివరకు దేశం పేరునే మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అంటూ ప్రజల్ని తప్పుతోవ పట్టిస్తున్నారనీ, ఎన్నికల ఖర్చు తగ్గుతుందని అబద్ధ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. వాస్తవానికి మోడీ సర్కార్‌ హయాంలో జరిగిన రూ.7.5 లక్షల కోట్ల అవినీతిని ‘కాగ్‌’ ఎత్తిచూపిందని గుర్తుచేశారు. ఇలాంటి కుంభకోణాల ముందు ఎన్నికల ఖర్చు పెద్దదేం కాదన్నారు. ఎలక్ట్రోరల్‌ బాండ్ల రూపంలో కార్పొరేట్ల నుంచి భారీగా డబ్బు దండుకొని, దేశంలోనే అత్యంత సంపన్న పార్టీగా బీజేపీ ఎదిగిందని చెప్పారు. ఎన్నికల సంస్కరణలపై అప్పటి కేంద్రమంత్రి, కమ్యూనిస్టు నాయకుడు ఇంద్రజిత్‌గుప్తా నేతృత్వంలోని కమిటీ అనేక సిఫార్సులు చేసిందనీ, దానిపై చర్చించేందుకు ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధంగా లేవన్నారు. తెలంగాణలో మతోన్మాద బీజేపీకి తావుండకూడదనే తాము పోరాటం చేస్తున్నామనీ, కమ్యూనిస్టులు ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటారే తప్ప, వారికి ఎలాంటి వ్యక్తిగత లాభాపేక్ష ఉండదని స్పష్టం చేశారు. దేశంలో బీజేపీని సమూలంగా నిర్మూలించాలనీ, దానికోసం త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రజలు ‘ఓటు’ అనే ఆయుధాన్ని సంధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగం, ధరలు పెరిగి ప్రజలు నానా అవస్థలు పడుతుంటే, వారి దృష్టిని మళ్ళించేందుకు ‘ఇండియా’ పేరును ‘భారత్‌’గా మార్పు చేస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 1947లో ఇండియా పేరును పెట్టుకోవడానికి వీల్లేదని మహ్మద్‌ అలీ జిన్నా బ్రిటీషర్లకు సూచించారనీ, ఇప్పుడు అదే పని ప్రధాని నరేంద్రమోడీ చేస్తున్నారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ఎవరితో కలవకుండా, వచ్చే ఎన్నికల్లో ఎవరికీ మెజారిటీ రాకుంటే బీజేపీకి మద్దతిచ్చి, కేంద్ర మంత్రివర్గంలో చేరాలని తాపత్రయపడుతున్నదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు అరెస్టుకు అక్కడి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి బీజేపీ సహకారం ఉన్నదని చెప్పారు. బీజేపీని ఓడిస్తేనే భారత సమైక్యత పరిరక్షింపబడుతుందని అన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ మాట్లాడుతూ విలీన దినోత్సవాన్ని అదే పేరుతో అధికారికంగా నిర్వహించలేని పిరికి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నదని బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి అన్నారు. సీఎం కేసీఆర్‌ బీజేపీకి వ్యతిరేకం అంటూనే ఆపార్టీ వ్యతిరేక ఓటు చీలకుండా కాపాడుతున్నారనీ, ఎంఐంఎం కూడా ఆ తానులోని ముక్కే అని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కేంద్రానికి బానిసగా మారాడనీ, అందుకే లిక్కర్‌ స్కాంలో కవిత అరెస్టు ఆగిపోయిందని చెప్పారు. కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షత వహించారు. అనంతరం సురవరం సుధాకరరెడ్డి, తెలంగాణ సాయుధ పోరాట యోధులు డీ నారాయణరావు, కవి జయరాజ్‌ను సన్మానించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, జాతీయ సమితి సభ్యులు శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి, పశ్యపద్మ, ఎమ్‌ బాలమల్లేష్‌, ఎమ్‌ బాలనర్సింహా, వీఎస్‌ బోస్‌ తదితరులు పాల్గొన్నారు. సభ ప్రారంభానికి ముందు సాయుధ పోరాట అమరుల స్థూపానికి నివాళులర్పించారు.

Spread the love