– బీజేపీతో రేవంత్, కేసీఆర్ లాలూచీ కుస్తీ తగదు
– అప్రజాస్వామిక ధోరణిని ప్రజలు అంగీకరించరు
– విభజన హామీలు విస్మరించిన కేంద్రం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య
– డోర్నకల్‌లో సీపీఐ(ఎం) మహబూబాబాద్ జిల్లా మహాసభ ప్రారంభం
నవతెలంగాణ-మహబూబాబాద్
దేశంలో పెరుగుతున్న పేదరికం, నిరుద్యోగం, ఆకలి, అప్రజాస్వామిక విధానాల నుంచి ప్రజలకు దారి, ప్రత్యామ్నాయం చూపేది కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. బీజేపీతో రేవంత్, కేసీఆర్ లాలూచీ కుస్తీ తగదని, పాలకులు అవలంబిస్తున్న అప్రజాస్వామిక విధానాల్ని ప్రజలు అంగీకరించరని చెప్పారు. సీపీఐ(ఎం) మహబూబాబాద్ జిల్లా 3వ మహాసభ శనివారం డోర్నకల్‌లోని బిషప్ అజరయ్య ఫంక్షన్‌హాల్‌లో వై.వెంకటయ్య ప్రాంగణంలో ప్రారంభమైంది. అంతకుముందు డోర్నకల్‌లో ఎన్టీఆర్ చౌరస్తా నుంచి మహాసభ ప్రాంగణం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు వెన్నం కృష్ణారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. సీతారాం ఏచూరీ చిత్రపటానికి నివాళులర్పించారు. పార్టీ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, గునిగంటి రాజన్న, అల్వాల సత్యవతి, భానోత్ సీతారాం, దుడ్డేల రామ్మూర్తి అధ్యక్షవర్గంగా వ్యవహరించిన సభలో వీరయ్య మాట్లాడారు.
రాష్ట్రంలో అహంకారం, అహంభావం, అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా.. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితో ప్రజలు కేసీఆర్‌ను ఓడించి రేవంత్‌రెడ్డికి పట్టం కట్టారని వీరయ్య చెప్పారు. ఎన్నికల్లో ఆరు గ్యారంటీల గురించి చెప్పిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల అనంతరం ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారని అన్నారు. అధికారంలోకొచ్చి ఏడాది కావస్తున్నా హామీల అమలులో విఫలమవుతోందని విమర్శించారు. ప్రగతి భవనం చుట్టూ కంచె ధ్వంసం చేసి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించామని చెబుతూ.. మహబూబా బాద్ పట్టణంలో కలెక్టరేట్ వెనుక పేదలు వేసుకున్న గుడిసెలను అప్రజాస్వామికంగా ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల గుడిసెలను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 18 సార్లు ధ్వంసం చేయగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే చేస్తోందన్నారు. హనుమకొండ, కోరుట్ల, జనగామ, జగిత్యాలలో పేదలు వేసుకున్న గుడిసెలను రాత్రికి రాత్రే కూల్చేశారని, తమ కార్యకర్తలను అరెస్టు చేసి జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌రెడ్డికి తప్పదని హెచ్చరించారు.
వికారాబాద్ జిల్లాలో రైతులు ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ఉద్యమించారని, భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా లేరని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఇలాగే మల్లన్నసాగర్‌లో బలవంతంగా భూములు లాక్కుంటే రైతులు తిరగబడ్డారని అన్నారు. పాలకుల ప్రజావిధానాలకు వ్యతిరేకంగా రోడ్డు మీదికి వచ్చిన ప్రజలకు ఎర్రజెండాలు ఇస్తామని, వారికి అండగా కమ్యూనిస్టులు నిలబడతారని చెప్పారు. ఆగస్టు 15కల్లా రైతులందరికీ రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని దేవుళ్లపై ఒట్టేసి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి హామీ ఏమైందని ప్రశ్నించారు. రూ.18వేల కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయని తెలిపారు. రైతుబంధుపై మంత్రులు విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున గ్రూప్-1 యువత నాలుగు రోడ్లపై నిరసన వ్యక్తం చేసినా.. ఆ రిజర్వేషన్ సమస్య పరిష్కారం కాలేదన్నారు. రాష్ట్రంలో కోటి మంది కార్మికులకు వేతనాల పెంపు జీవో రాలేదని అన్నారు.
కేంద్ర మంత్రుల మాటలు విడ్డూరం
మరోవైపు బండి సంజరు, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులుగా ఉండి ఏమీ తెలియదన్నట్టు ప్రజల సమస్యలపై తిరుగుబాటు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 11 ఏండ్లుగా దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉందని, ఐదేండ్లుగా కిషన్ రెడ్డి మంత్రిగా ఉండి రాష్ట్ర సమస్యలను విస్మరించారని అన్నారు. తెలంగాణ విభజన హామీలను పూర్తిగా విస్మరించారన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, మానుకోట బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన విశ్వవిద్యాలయాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్, నేడు సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ నరేంద్ర మోడీతో లాలూచీ కుస్తీ పడుతున్నారని విమర్శించారు. విభజన హామీలపై 11 సంవత్సరాలైనా అతీగతి లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి రాష్ట్రంలో బొగ్గు గనులను అమ్మడానికి కుట్రపూరితంగా వ్యవహరి స్తున్నాయని అన్నారు. ఈ మహాసభలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్, సీనియర్ నాయకులు జి.రాములు, జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సుర్ణపు సోమయ్య, శెట్టి వెంకన్న, అల్వాల రాజన్న, ఆకుల రాజు, కందునూరి శ్రీనివాస్, డోర్నకల్ మండల కార్యదర్శి ఉప్పనపల్లి శ్రీనివాస్, మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు బీఆర్ వీరస్వామి పాల్గొన్నారు.
రాష్ట్రంలో బ్లాక్‌మెయిల్ రాజకీయాలు..
కేసీఆర్, కేటీఆర్ అధికారంలో ఉన్నంతకాలం అప్రజాస్వామికంగా వ్యవహరించి ఓడిపోగానే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని వీరయ్య అన్నారు. నాటి తప్పులను నేడు వారు ఒప్పుకోవాలని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పరస్పరం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. అటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇటు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటలు హాస్యాస్ప దంగా ఉన్నాయన్నారు. అవినీతిపై ఆధారాలు ఉంటే కేసులు పెట్టి జైలుకు పంపాలని, బెదిరింపులు ఎందుకని ప్రశ్నించారు.