కమ్యూనిస్టులకు చట్టసభల్లో ప్రాతినిధ్యముండాలి

Communists should have representation in legislatures– ప్రజల పక్షాన నిజాయితీగా పోరాడేది మేమే
– అసెంబ్లీలో ఉంటే మరింత ప్రయోజనం
– వామపక్ష, ప్రజాతంత్ర, సామాజిక, లౌకిక, పోరాడే శక్తులకు మద్దతు
– మునుగోడు ఎన్నికలపుడు కేసీఆరే మా మద్దతు అడిగారు
– ఆ తర్వాత కూడా ఇది కొనసాగుతుందని ఆయనే చెప్పారు
– ఇప్పుడు కూడా కాంగ్రెస్‌ నాయకులే కలిసి పోటీ చేద్దామన్నారు
– మేం ఎవరితో పొత్తుకు వెంపర్లాడలేదు బీజేపీని ఓడించడమే మా లక్ష్యం : తమ్మినేని వీరభద్రం
రాష్ట్రంలో కమ్యూనిస్టులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఈ ఎన్నికల్లో వామపక్షాలను ఆదరించాలనీ, సీపీఐ(ఎం)ను అసెంబ్లీకి పంపాలని కోరారు. ప్రజల పక్షాన సమస్యలపై నిజాయితీగా పోరాడేది కమ్యూనిస్టులేనని అన్నారు. అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉంటేనే ప్రజలకు మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు. లేకుంటే ప్రజలకు నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులను గెలిపించాలనీ, తెలంగాణలో ఎర్రజెండా రాజ్యం రావాలని ఆకాంక్షించారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌తో పొత్తు కోసం తాము వెంపర్లాడలేదని చెప్పారు. బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. ఈ ఎన్నికల్లో వామపక్ష, ప్రజాతంత్ర, సామాజిక, లౌకిక, పోరాడే శక్తులకు మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకుని వామపక్షాలకు ఓటేయాలనీ, సీపీఐ(ఎం)ను బలపరిచి అసెంబ్లీకి పంపాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు తమ్మినేని ప్రత్యేక ఇంటర్వ్యూ..
బూర్జువా పార్టీల స్వభావం గురించి తెలిసినా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌తో పొత్తు ప్రయత్నం ఎందుకు? సొంతంగా పోటీ చేసే అవకాశం లేదంటారా?
బీఆర్‌ఎస్‌తో పొత్తుకు, కాంగ్రెస్‌తో పొత్తుకు మేము వెంపర్లాడలేదు. ఆ పార్టీలతో పొత్తు కావాలని మేం కోరలేదు. మునుగోడు ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాతో బీజేపీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చేరాడు. బీజేపీని ఓడించడం మీ విధానం కాబట్టి సహకరించాలని కోరారు. అయితే ఆయన కోరినందుకు మేం మద్దతివ్వలేదు. బీజేపీ అక్కడ గెలిచే ప్రమాదముంది. బీజేపీ నాయకుల వ్యూహం అదే. అక్కడ గెలిచి తెలంగాణ ప్రజానీకానికి ఓ సంకేతం పంపాలనుకున్నారు. భవిష్యత్తులో బీఆర్‌ఎస్‌ను ఓడించేది బీజేపీయే అన్నది ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వారి వ్యూహం ఫలించేది. రాష్ట్రంలో బీజేపీ బలపపడం, మతోన్మాద రాజకీయాలు పెరగడం ప్రజలకు ప్రమాదం. అందుకే బీజేపీని ఓడించడం కోసమే బీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చాం. ఆ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులూ మా కార్యాలయానికి వచ్చి మద్దతు అడిగారు. బీఆర్‌ఎస్‌ను సమర్థించాలా?, కాంగ్రెస్‌ను సమర్థించాలా? అనేది మా సమస్య కాదు. బీజేపీని ఓడించడమే మా లక్ష్యం. ఈ విషయాన్నే కాంగ్రెస్‌కు చెప్పాం. ఓడించే శక్తి ఎవరికుంది? అనేది ప్రశ్న. క్యాడర్‌ను నిలబెట్టి బీజేపీని ఓడించే శక్తి ఉంటే కాంగ్రెస్‌కే మద్దతు ఇస్తామని ఆనాడే చెప్పాం. కానీ కాంగ్రెస్‌ ఆ పరిస్థితిలో లేదు. అయితే బీఆర్‌ఎస్‌ పాలన పట్ల మాకు అభ్యంతరాలున్నాయి. కానీ అక్కడున్న పరిస్థితిలో మా కర్తవ్యం బీజేపీని ఓడించడం. అందుకే బీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చాం. ఇది ఎన్నికల ఫలితాల్లో రుజువైంది. బీజేపీని ఓడించడంలో కమ్యూనిస్టులు ప్రధాన భూమిక పోషించారు. అది మునుగోడు ఎన్నికల వరకే పరిమితమని కూడా మేం స్పష్టం చేశాం. సీఎం కేసీఆరే కమ్యూనిస్టులతో స్నేహం మునుగోడు ఎన్నికల వరకే పరిమితం కాదనీ, రాబోయే ఎన్నికల్లోనూ కొనసాగుతుందని ఖమ్మం సభలో ప్రకటించారు. కేరళ ముఖ్యమంత్రిని పిలిచారు. బీఆర్‌ఎస్‌ పాలనలో లోపాలున్నా బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్‌ నిలబడడాన్ని మేం స్వాగతించాం.
బీఆర్‌ఎస్‌ మీకు ఎందుకు సీట్లు ఇవ్వకుండా నిరాకరించిందంటారు?
బీఆర్‌ఎస్‌గానీ ఇతర ప్రాంతీయ పార్టీలుగానీ అవకాశవాదంతో వ్యవహరిస్తాయి. టీడీపీ, వైసీపీ, ఎస్పీ, బీఎస్పీ ఇలా ప్రాంతీయ పార్టీలన్నీ రాజకీయ అవసరాల కోసం నిర్ణయాలు తీసుకుంటాయి. ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను గద్దెదించడమే మా లక్ష్యమని బీజేపీ ప్రకటించింది. అందుకనుగుణంగానే హుజూరాబాద్‌, దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రభావం చూపింది. ఆ ఊపులో అసెంబ్లీ ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ అన్న వాతావరణాన్ని సృష్టించాలని భావించింది. ఆ సమయంలో కేసీఆర్‌కు మరో మార్గం లేదు. ఆయన సీటుకే ఎసరొచ్చింది. అందుకే బీజేపీని వ్యతిరేకించారు. ఆయన ఏ వైఖరితో నిర్ణయం తీసుకున్నా బీజేపీని ఓడిస్తామన్నారు కాబట్టి మేం బీఆర్‌ఎస్‌ను సమర్థించాం. ఆ పరిస్థితుల్లోనే మునుగోడులో పొత్తు సాగింది.
ఆ తర్వాత కర్నాటక ఫలితాలొచ్చాయి. దీంతో రాష్ట్ర రాజకీయ పరిస్థితిలో మార్పు వచ్చింది. బీజేపీ మూడో స్థానంలోకి వెళ్లిపోయింది. దీంతో ఆ పార్టీ నాయకులు వేరే పార్టీల్లోకి పోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పుంజుకుంది. బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌ అన్నట్టుగా మారింది. కేసీఆర్‌ మూడ్‌ మారిపోయింది. బీజేపీ ప్రమాదం లేదు. ఈ ఎన్నికల్లో అవసరమైతే సీట్లు తక్కువైతే బీజేపీ, ఎంఐఎం మద్దతు తీసుకునే పరిస్థితి ఉన్నది. అందుకే కమ్యూనిస్టుల అవసరం కేసీఆర్‌కు లేదు. అవకాశవాదంతో రాజకీయాలను మార్చారు. మమ్మల్ని దూరం పెట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ కోసమూ మేం వెంపర్లాడలేదు. కమ్యూనిస్టులతో ఉంటేనే గెలుస్తామనే పరిస్థితి కాంగ్రెస్‌కు అప్పుడు ఉన్నది. అందుకే మాణిక్‌రావు ఠాక్రే స్వయంగా నాకు ఫోన్‌ చేసి పొత్తు ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఎవరూ లేకుండానే గెలవగలం అనే నమ్మకంతో ఉన్నట్టున్నారు. అనేక మంది చేరుతున్నారు. అధికారంలోకి వస్తామను కుంటున్నారు. అందుకే కమ్యూనిస్టులకు నాలుగు సీట్లు ఇవ్వడం ఎందుకన్న అభిప్రాయంతో కాంగ్రెస్‌ నాయకులున్నారు. అందుకే సీట్లు నిరాకరిస్తున్నారు.
కాంగ్రెస్‌ సీట్లు ఇస్తామని అంగీకరించింది కదా? ఎందుకివ్వలేదంటారు?
భద్రాచలం, మధిర సిట్టింగ్‌ సీట్లు కాబట్టి ఇవ్వలేమన్నారు. బలమైన నాయకులు వచ్చారు కాబట్టి పాలేరు ఇవ్వలేదు. అయినా వాటిని వదిలేశాం. మేం అడగకపోయినా వైరా ఇస్తామన్నారు. తర్వాత అలా చెప్పలేదంటూ మాట మార్చారు. ఇప్పుడు మిర్యాలగూడ, హైదరాబాద్‌లో ఒక సీటు ఇస్తామంటున్నారు. అది మలక్‌పేట లేదా చాంద్రాయణగుట్ట ఏదో ఒకటి ఇవ్వొచ్చు. అది కూడా స్పష్టంగా చెప్పలేదు. మాట తప్పింది కాంగ్రెస్‌. దీనికి కాంగ్రెస్సే సమాధానం చెప్పాలి. పాలేరు మా బలమైన సీటు కాబట్టి అడిగాం. అయినా ఇప్పుడు దానికోసం పట్టుపట్టలేదు. వదిలేశాం. వైరా కోరలేదు అయినా ఇస్తామంటే సరే అన్నాం. ఇప్పుడు అదీ ఇవ్వబోమంటున్నారు. ఏ సీట్లు ఇస్తారో స్పష్టత లేదు. అనివార్య పరిస్థితుల్లోనే మేం ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించాం. అందుకనుగుణంగానే 17 సీట్లలో పోటీలో ఉంటామని ప్రకటించాం.
కమ్యూనిస్టుల బలం తగ్గిందన్న అభిప్రాయం ప్రజల్లో ఉన్నది కదా? దీనిపై ఏమంటారు?
మా బలమేంటో తెలియకే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పొత్తు కావాలని మమ్మల్ని సంప్రదించాయా?. మా బలాన్ని బట్టే సీట్లు అడిగాం. 119 సీట్లు కావాలని మేం అడగలేదు. అయినా ఇవ్వడానికి నిరాకరించారు.
కమ్యూనిస్టులు సొంతంగా పోటీ చేయొచ్చు కదా?
అప్పుడు మీరే అంటారు తక్కువ బలం ఉన్నా ఎక్కువ సీట్లలో పోటీ చేస్తున్నారు?అని. ఎవరికో సహాయం చేయడానికే ఇలా చేస్తున్నారని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే ప్రయత్నం చేస్తున్నారని అంటారు. ఇప్పుడు ఒక ట్రెండ్‌ ఉంది. కొన్ని పత్రికలు, కమ్యూనిస్టులను వ్యతిరేకించే వారు ఓ అభిప్రాయంతో ఉన్నారు. కమ్యూనిస్టులు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని విమర్శిస్తుంటారు. ఒక పార్టీతో కలిసి పోటీ చేస్తే తోక పార్టీ అంటారు. విడిగా పోటీ చేస్తే ఎవరికో సహాయం చేయడానికి అంటారు.
ఏం చేసినా అపనిందలు వేసి ప్రచారం చేస్తున్నారు. వాటి ఆధారంగా రాజకీయాలు, నిర్ణయాలు మేం చేయడం లేదు. మాకు సీట్లు వద్దని కాంగ్రెస్‌కు కొందరు మద్దతు ఇచ్చారు. కమ్యూనిస్టులు ఆ వైఖరి తీసుకోలేరు. జెండా, ఎజెండా, విధానం మాకు ఉంది. గెలిచినా, ఓడినా ప్రజల్లోకి వెళ్తాం. వందేండ్ల చరిత్రలో కమ్యూనిస్టులు ఎప్పుడూ గెలుస్తూనే ఉన్నారా?. పార్లమెంటరీ వ్యవస్థలో ఎన్నికల్లో పోటీ చేయాలి. కమ్యూనిస్టుల విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఓ సాధనంగా వినియోగించుకుంటాం. గెలిస్తేనే పోటీ చేయాలి. ఓడిపోతే పోటీ చేయొద్దు అని భావించడం సరైంది కాదు. అపనిందలను ఎదుర్కొంటాం. వాటికి భయపడి మా విధానాన్ని మార్చుకోలేం కదా.
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లో ఎవరిని గెలిపించాలంటారు? ఎవరిని ఓడించాలంటారు? మీరు ఏ పార్టీకి మద్దతిస్తారు?
మేం తీసుకునే నిర్ణయాలు రాజకీయ విధానానికి లోబడి ఉంటాయి. మాకు సీట్లు ఇవ్వడానికి నిరాకరించారు కాబట్టి ఆ పార్టీలను గుడ్డిగా వ్యతిరేకించం. కోపతాపాలతో నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదు. మాకు రాజకీయ విధానం ఉంది. అందుకనుగుణంగా నిర్ణయాలుంటాయి. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రాకూడదు. ఒక్క సీటునూ గెలవొద్దన్నదే మా లక్ష్యం. మతోన్మాదం, రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడం, ప్రయివేటీకరణ వంటి విధానాలను ఆ పార్టీ అనుసరిస్తున్నది. అందుకే దేశ రక్షణ కోసం దేశభక్తియుతమైన లక్ష్యం మేం నిర్దేశించుకున్నాం. మేం నష్టపోయినా సరే పోటీ చేసే అవకాశం లేకపోయినా సరే బీజేపీని మాత్రం గెలవనీయకూడదు. బీజేపీ గెలిచే అవకాశం ఉన్న చోట కాంగ్రెస్‌ లేదా బీఆర్‌ఎస్‌లో ఏది బలంగా ఉంటే ఆ పార్టీకి మద్దతిస్తాం. ఆ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలుంటాయి. మిగతా చోట్ల వారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం మాకేంటీ?. మాకు సీట్లు ఇవ్వకుండా, మమ్మల్ని గౌరవించకుండా, మా ప్రయోజనాలను కాపాడని పార్టీలకు మేం ఎందుకు మద్దతివ్వాలి.
సీపీఐ, ఎంఎల్‌ పార్టీలు, బీఎస్పీ వంటి పార్టీలకు మద్దతిస్తాం. ఎవరూ లేకుంటే స్వచ్చంధ సంస్థలు, ప్రజల కోసం పనిచేసే వారికి మద్దతు ఇస్తాం. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నది మా విధానం కాదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ను ఓడించాలన్న లక్ష్యం మాకు లేదు. దేశ రాజకీయాల్లో బీజేపీని, మతోన్మాదాన్ని ఓడించాలన్నదే మా లక్ష్యం. ఆ మతోన్మాద శక్తులకు సహకరించే పార్టీలను ఓడించాలన్నది మా విధానం. వ్యతిరేకించే శక్తులకు మేం మద్దతిస్తాం.
ఈ ఎన్నికల్లో ఏ నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు?
మేం మూడు నినాదాలు తీసుకున్నాం. ఒకటి, బీజేపీని ఓడించాలి. రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. అయినా ఆ పార్టీ ఒక్క సీటూ గెలవొద్దు. దాన్ని ఓడించడమే మా కర్తవ్యం. రెండు, కమ్యూనిస్టులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండాలి. అది ప్రజల గొంతు వినిపించడానికి ఉపయోగపడుతుంది. శ్రామికవర్గం, కార్మికవర్గం, ఆశాలు, అంగన్‌వాడీలు, వ్యవసాయ కార్మికులు, రైతులు, మహిళలు, యువకులు, విద్యార్థులందరి ప్రయోజనాలు కాపాడేది, అందరి కోసం నిజాయితీగా పోరాడేది కమ్యూనిస్టులే. పార్లమెంటు, అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోయినా ప్రజాక్షేత్రంలో పోరాటాలు నిర్వహిస్తున్నది. మూడు, ప్రజల తరఫున ఉద్యమిస్తున్నది కమ్యూనిస్టులే. చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉంటే ప్రజలకు మరింత ప్రయోజనం కలుగుతుంది. కమ్యూనిస్టులు పోటీ చేయని చోట ఇతర వామపక్ష శక్తులు సీపీఐ, ఇతర కమ్యూనిస్టులు, సామాజిక శక్తులు బీఎస్పీ, ఇతర పార్టీలు, లౌకిక శక్తులు, పోరాడే శక్తులకు ఓటేయాలని చెప్తాం.

Spread the love