నాజీలు సాగించిన ఊచకోతతో పోలికా?

carried out by the Nazis Comparison with Massacre?– అక్టోబరు7 దాడిపై ఓ విశ్లేషణ
న్యూయార్క్‌: గాజాపై సాగిస్తున్న క్రూరమైన యుద్ధ నేరాలను సమర్థించుకునేందుకు అక్టోబరు7 దాడిని నాజీ హిట్లర్‌ సాగించిన సామూహిక మారణకాండతో పోల్చడం హాస్యాస్పదంగా ఉందని మార్క్సిస్టు విశ్లేషకుడు జె ఇ రోజన్‌బర్గ్‌ పేర్కొన్నారు. హమాస్‌ దాడిని సాకుగా చూపి ఇజ్రాయిల్‌ తన దుర్మార్గాలను సమర్థించుకునేందుకు చేస్తున్న యత్నాలపై స్పందిస్తూ ‘పీపుల్స్‌ వరల్డు’ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బలమైన యూదు ఆర్మీ, శక్తివంతమైన యూదు రాజ్యం లేకుంటే మరో మారణ హౌమం ముంచుకొచ్చే ప్రమాదముందని ఇజ్రాయిలీయులకు అక్కడి యూదు దురహంకార ప్రభుత్వాలు ఎలిమెంటరీ స్కూల్‌ నుంచే నూరిపోస్తుంటాయి. ఇది నా స్వీయానుభవంతో చెబుతున్నానని రోజెన్‌బర్గ్‌ తెలిపారు. అక్టోబరు7న హమాస్‌ దాడి జరిగిన వెంటనే ఈ మారణ హౌమం కార్డును ఒక రక్షణ కవచంగా ఇజ్రాయిల్‌ వాడుకుంది. ఆ పేరుతో గాజాను పూర్తిగా కబళించేందుకు, పాలస్తీనీయులను ఊచకోత కోసేందుకు నెతన్యాహు ప్రభుత్వం తెగబడుతోందన్నారు. అక్టోబరు7 దాడి జరిగిన మరుసటి రోజు ఇజ్రాయిల్‌ అధ్యక్షుడి మాజీ మీడియా సలహాదారు, ప్రభుత్వ ప్రతినిధి ఐలాన్‌ లెవీ మాట్లాడుతూ, నాడు హిట్లర్‌ యూదులపై సాగించిన మారణకాండకు ఇది ఏమాత్రం తీసిపోదని, ఇది ఇజ్రాయిల్‌ చరిత్రలోనే అత్యంత దుర్దినంగా మిగిలిపోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నారు. పదాల తేడా తప్ప ఇంచుమించు ఇదే విధమైన వైఖరిని ఆంగ్లో, అమెరికా, దాని మిత్ర పక్షాల నేతలు ప్రదర్శించారు. ఈ రెండింటిని ఒకే గాటన కట్టడం చాలా ప్రమాదకరం. తరతరాలుగా పాలస్తీనా భూములను అక్రమించి, వారిని బానిసలుగా చూసే ఇజ్రాయిలీ దాష్టీకాలపై ఆకస్మిక తిరుగుబాటే అక్టోబరు7 ఘటన. ఇజ్రాయిల్‌ సైన్యం ప్రపంచంలోనే అత్యంత అధునాతన ఆయుధ సామగ్రిని కలిగిన శక్తివంతమైన ఆర్మీల్లో ఒకటి. హమాస్‌ దాడి ఒకటి రెండు రోజులకు మాత్రమే పరిమితమైనది. ఈ దాడిలో ఇజ్రాయిల్‌కు చెందిన 1300 మంది మరణించారు. నాజీలు యూదులను ఉనికిలో లేకుండా చేయాలన్న లక్ష్యంతో 12 ఏళ్లుగా ఊచకోత సాగించారు. 1941-45 మధ్య నాలుగేళ్లలో అత్యధికమందిని నాజీలు పొట్టనపెట్టుకు న్నారు. మొత్తం 6,00,000 మంది యూదులను నాన్‌ స్టాప్‌గా హిట్లర్‌ ఊచకోత సాగించాడు. కాబట్టి ఆనాటి ఊచకోతతో హమాస్‌ ప్రతిఘటనా దాడిని పోల్చడం పూర్తిగా నిర్హేతుకం. అదీగాక హిట్లర్‌ నాజీ సేనలు యూదులను సర్వనాశనం చేయడమే లక్ష్యంగా మారణకాండ సాగించాయి. హమాస్‌ అలా కాదు, ఇజ్రాయిల్‌ ఆక్రమణదారు చేతిలో బాధితురాలు. అక్టోబరు7న జరిపిన ఆకస్మిక దాడిలో చనిపోయిన వారిలో యూదులతో బాటు నేపాల్‌, థాయిలాండ్‌, ఇతర దేశాలకు చెందినవారు, ఇతర మతాలు, జాతులకు చెందినవారు ఉన్నారు. ఏ విధంగా చూసినా ఈ రెండిటి మధ్య పోలిక ఎంతమాత్రమూ పొసిగేది కాదని రోజన్‌బర్గ్‌ స్పష్టం చేశాడు.

Spread the love