– పంట నష్టం అంచనాల్లో సగానికి సగం కోత
– తొలుత 6 లక్షల ఎకరాలు
– చివరికి 3 లక్షల ఎకరాల్లోపు
అమరావతి : ఇటీవలి వరదలకు పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం అందించాల్సిన సాయంలో సగానికి కోత పడింది. హడావుడి ఎన్యూమరేషన్, మూడవ వంతు (33 శాతం)పైన నష్టం కనిపించాలన్న నిబంధన.. ఈ రెెండింటి వలన రైతులకు సర్కారు ప్రకటించిన వరద సాయాన్ని లక్షల మంది మంది రైతులు కోల్పోవాల్సి వచ్చింది. ప్రభుత్వం అందించామన్న సాయంలో కూడా సరైన రికార్డులు, గుర్తింపు లేక వాస్తవంగా పంటలు సాగు చేసి నష్టపోయిన కౌలు రైతుల్లో అత్యధికులకు అన్యాయం జరిగింది. ఆగస్టు చివరిలో, సెప్టెంబర్ మొదట్లో వాయుగుండం వలన 19 జిలాల్లో పంటలను భారీ వర్షాలు, వరదలు ముం చెత్తాయి. వాగులు, వంకలు, డ్రైన్లతో పాటు కృష్ణా, గోదావరి నదులకూ భారీగా వరదలొచ్చి లక్షల ఎకరాల్లో పంటలను ముంచాయి. అనూహ్య వరదలన్న రాష్ట్ర ప్రభుత్వం, రైతులకు ప్రత్యేక సాయం ప్రకటిం చింది. ఆ పరిహారం చాలదని రైతులు, కౌలు రైతులు డిమాండ్ చేస్తున్నారు. సర్కారు వరికి ఎకరానికి రూ.10 వేలు ప్రకటించగా, రూ.25 వేలివ్వాలని, పత్తి, మిర్చి, తోటలకు కనీసం ఎకరానికి రూ.50 వేలు కోరుతన్నారు. అయితే ప్రభుత్వం సాయాన్ని పెంచకపోగా తానిస్తానన్న పరిహారాన్ని సైతం పంటలు నష్టపోయిన రైతులందరికీ ఇవ్వలేదు.
అంత వ్యత్యాసమా?
కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందాలకు రాష్ట్ర సర్కారు సమర్పించిన నివేదికల్లోనూ ,ముఖ్యమంత్రి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో దాదాపు ఆరు లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం సంభవించిందని పేర్కొన్నారు. ఎన్యూమరేషన్ సక్రమంగా జరిగితే నష్టం ఇంకా పెరిగేది. కానీ విచిత్రంగా నష్టపోయిన పంటల విస్తీర్ణం మూడు లక్షల ఎకరాలకు తగ్గింది. వ్యవసాయ పంటల విషయానికే వస్తే ఎన్యూమరేషన్ నాటికి 5.93 లక్షల ఎకరాలని అంతర్గతంగా తేల్చారు. తీరా ఇన్‌పుట్ సబ్సిడీ జమ చేసేదగ్గరకొచ్చేసరికి అమాంతం 2.90 లక్షల ఎకరాలకు తగ్గిపోయింది. రెండు లక్షల మంది రైతులకే బ్యాంక్ ఖాతాల్లో ఇన్‌పుట్ సబ్సిడీ జమ చేశారు. వీరిలో కూడా సాంకేతిక కారణాల వలన వేలాది మంది రైతులకు పేమేంట్ జరగలేదని సమాచారం.
అందుకే..
పంట నష్టాలపై ప్రభుత్వం హడావిడి చేసింది. దాంతో క్షేత్ర స్థాయి సిబ్బంది వాస్తవ నష్టాలను నమోదు చేయకుండా ఆదరాబాదరగా ప్రభుత్వానికి నివేదికలు పంపారు. పారదర్శకత పాటించలేదు. లబ్ధిదారుల జాబితాలను బహిరంగంగా వెల్లడించ లేదు. అసలు తమ పేరు ఉందో లేదో చెప్పేనాథుడు లేడు. ఎక్కడైనా రైతులు ఆందోళన చేస్తే ఆధార్ నెంబర్ బేస్‌గా అరకొర సమాచారం ఇస్తున్నారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో 33 శాతం, అంతకంటే ఎక్కువ పంట నష్టం జరిగితేనే పరిహారం ఇస్తామన్న స్పష్టత ఇవ్వలేదు. కానీ అంతర్గతంగా ఇచ్చిన గైడ్‌లైన్స్‌లో మాత్రం ఆ నిబంధనను అమలు చేయాలని ఆదేశించారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) రూల్స్‌ను తప్పనిసరిగా పాటించాలన్నారు. దాంతో లక్షల మంది రైతులు ప్రభుత్వ పరిహారాన్ని కోల్పోయారు. బుడమేరు, ఏలేరు, కృష్ణా, గోదావరి నదులకు పోటెత్తిన వరదలకు, భారీ వర్షాల వలన డెల్టాలలో డ్రైన్ల ముంపునకు ప్రధానంగా వరి పంట నీట మునిగింది. వారం పది రోజులు నీటిలోనే వరి చేలున్నాయి. దిగుబడి బాగా తగ్గుతుందని రైతులు వాపోతున్నారు. పత్తి, ఇతర పంటల విషయంలోనూ అంతేనంటున్నారు. కానీ ఎన్యూమరేషన్ అధికారులు నీరు తీస్తే పంటలకు అంత డ్యామేజి ఉండదంటూ పరిహారానికి అనర్హులను చేశారని రైతులు ఆవేదన చెందుతున్నారు.