పార్లమెంట్‌ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ

పార్లమెంట్‌ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలో సీపీఐ(ఎం) రెండు స్థానాల్లో పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్ర, శనివారాల్లో పార్టీ కార్యదర్శి వర్గం, రాష్ట్ర కమిటీ సమావేశాలను హైదరాబాద్‌లోని మాకినేని బసవపున్నయ్య భవన్‌లో నిర్వహించారు. సీపీఐ(ఎం)పోలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, విజయరాఘవన్‌ హాజరైన ఆ సమావేశాల్లో శాసన సభ ఎన్నికల తర్వాత రాజకీయ పరిస్థితి, లోక్‌సభ ఎన్నికలు, తదితర అంశాలను చర్చించినట్టు తెలిపారు. కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం జరగబోయే దేశవ్యాప్త సమ్మె, గ్రామీణబంద్‌కు సీపీఐ(ఎం) మద్దతు ప్రకటించింది. కార్యక్రమాన్ని విజయవతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని, ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఇండ్లు, ఇండ్ల స్థలాల పోరాటం కొనసాగుతున్నదనీ, ఆ పోరాటానికి పూర్తి మద్దతునిస్తూ, గుడిసెవాసులకు అండగా వుండాలని నిర్ణయించింది. ఈ పోరాటంలో పాల్గొన్న వారిపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలనీ, పేదలకు వెంటనే ఇండ్లు, ఇండ్ల స్ధలాలు కేటాయించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేసింది. కార్మికుల కనీస వేతనాల సమస్య మీద కేంద్రీకరించాలని నిర్ణయించింది. 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలో రెండు స్థానాలలో పోటీ చేయాలని, స్ధానిక జిల్లా కమిటీలతో చర్చించిన అనంతరం త్వరలో సీట్లను ఖరారు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని తమ్మినేని తెలిపారు.

 

Spread the love