నేటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే

Comprehensive family survey from today– 75 ప్రశ్నలతో వివరాలు సేకరణ
– ఈబీల వారిగా గణకుల నియామకం
– సమాచార గోప్యతపై సర్కార్‌ జాగ్రత్తలు
– సర్వే పూర్తయిన ఇండ్లకు స్టిక్కర్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే నేటి నుంచి ప్రారంభం కానున్నది. మొత్తం 75 ప్రశ్నలతో ఈ నెలాఖరు వరకు సర్వే చేయనున్నారు. సర్వేలో కుటుంబ యజమాని, సభ్యుల వివరాలు నమోదు చేస్తారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఫోన్‌ నంబర్‌, పని నమోదు చేయనున్నారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న కుటుంబసభ్యుల వివరాలూ నమోదు చేస్తారు. ఏ కారణంతో వలస వెళ్లారనే సమగ్ర సమాచారం సేకరించేలా ప్రశ్నలు రూపొందించారు. ప్రజలు తీసుకున్న రుణాలపై ప్రత్యేకంగా మూడు ప్రశ్నలు వేయనున్నారు. కుటుంబ సభ్యులందరి స్థిర, చరాస్తుల వివరాలు సేకరించనున్నారు. సర్వే పూర్తయిన ఇంటిగోడపై స్టిక్కర్‌ అంటిస్తారు.
విదేశాల్లో ఉన్న వారికి ప్రత్యేక కోడ్‌
కుటుంబంలో ఎవరైనా విదేశాలకు లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్లినట్లయితే, వారు ఎందుకు వెళ్లారో ప్రత్యేకంగా తెలుసుకుంటారు. చదువు, ఉద్యోగం, వ్యాపారం వంటి కారణాలతో బయటకు వెళ్లినవారికి ప్రత్యేక కోడ్లను ఉపయోగిస్తారు. కుటుంబ సభ్యుల స్థిరాస్తులు, చరాస్తుల వివరాలు, వారు తీసుకున్న రుణాలు, ఎందుకు తీసుకున్నారు తదితర సమాచారాన్ని సేకరించనున్నారు. కుటుంబంలో ఎవరైనా ప్రజాప్రతినిధిగా ఎన్నికై ఉంటే వారి వివరాలు సేకరిస్తారు. వార్డు సభ్యుల నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు వారి ఎన్నిక తదితర వివరాలను నమోదు చేస్తారు.
నోడల్‌ విభాగంగా ప్రణాళికశాఖ
సమగ్ర కుటుంబ సర్వేకు ప్రణాళికశాఖను నోడల్‌ విభాగంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో చేపడుతున్న సర్వేలో జిల్లా, మండల నోడల్‌ అధికారులు ఎన్యూమరేషన్‌ బ్లాక్‌ల గుర్తింపు, గణకుల నియామకం, ఇండ్ల జాబితా తయారీ, డేటా ఎంట్రీకి అవసరమైన మౌలిక సదుపాయాలను పర్యవేక్షిస్తారు. సెన్సెస్‌ డైరెక్టరేట్‌ నుంచి ఈబీ మ్యాపులను పొందడం, లేని ప్రాంతాల్లో కొత్త మ్యాపులను రూపొందిస్తారు. సర్వేలో పాల్గొంటున్న 80 వేల మంది ఉద్యోగుల్లో 48,229 మంది విద్యాశాఖకు చెందిన వారు కాగా, మిగతా వారిని ఇతర శాఖల నుంచి తీసుకున్నారు. సర్వే సమయంలో ఇండ్లను ఈబీలుగా విభజించారు. ఒక గ్రామంలో కనీసం 175 కుటుంబాలుంటే, వాటిని ఒక ఈబీగా నిర్ణయించి, ఒక గణకుడికి అప్పగించారు. కుటుంబాల సంఖ్య 175 కంటే ఎక్కువ ఉంటే వాటిని చిన్న యూనిట్లుగా విభజించి, ప్రతి ఈబీలో కనీసం 150 ఇండ్లు ఉండేలా పని విభజన చేశారు.
సర్వే పూర్తయిన ఇండ్లకు స్టిక్కర్‌
సర్వే పూర్తయిన ఇంటి గోడలపై గణకులు స్టిక్కర్లను అంటిస్తారు. అనంతరం, ఫారాల్లో నమోదు చేసిన వివరాలను కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తారు. డేటా ఎంట్రీ సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికశాఖ జిల్లా, మండలాల్లో అవసరమైన డేటా ఎంట్రీ ఆపరేటర్లను గుర్తించి, వారికి శిక్షణ పూర్తిచేసింది. ప్రతి రోజూ గణకులు సేకరించిన వివరాలను నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆపరేటర్లు నమోదు చేస్తున్న వివరాలను సూపర్‌వైజర్‌ స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు.
సమాచారం లీకైతే కఠిన చర్యలు
సర్వే నిర్వహణలో కుటుంబాల నుంచి సేకరించిన సమాచారం గోప్యంగా ఉంచాలని ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వివరాలను జాగ్రత్తగా భద్రపరచాలి. గణకులు వివరాలను డేటా ఎంట్రీ కేంద్రంలోకి తీసుకెళ్లే సమయంలో కూడా ఫారాలను గోప్యంగా ఉంచడంతో పాటు, ఆ డేటాను ఇతరులతో పంచుకోకుండా జాగ్రత్త వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి రోజూ నిర్వహించిన సర్వే వివరాలు, పురోగతిని సాయంత్రం 6 గంటల లోపు ప్రణాళికశాఖకు పంపనున్నారు. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, సర్వే వివరాలు లీకైతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటారు.

Spread the love