
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజాంబాద్ జిల్లా కేంద్రంలో గత 23 రోజులుగా జరుగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మెలో టి పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ అనిల్ కుమార్ పాల్గొని సంఘీభావం మద్దతు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 15 సంవత్సరాలుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు కేజీబీవీ ఉపాధ్యాయులు చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నారని, అనేక బాధలు పడ్డారని తెలియజేశారు. ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీని అమలు చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్షా ఉద్యోగులకు మొదటి నుండి టిపిటిఎఫ్ పూర్తి మద్దతిస్తుందని, భవిష్యత్తులో కూడా వారి వెంట ఉంటామని తెలియజేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా ఈనెల 26వ తేదీన హైదరాబాదులో ఇందిరాపార్క్ వద్ద భారీ స్థాయిలో ధర్నా నిర్వహించామని దానిలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పాల్గొని న్యాయబద్ధమైన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెను ప్రభుత్వంతో చర్చించి వారి సమస్య పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తానని తెలియజేశారు అన్నారు. ప్రభుత్వం మొండివైఖరి, ప్రత్యన్నాయాలను మాని వెంటనే చర్చలు జరిపి సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయ సమ్మతమైన డిమాండ్లను పరిష్కరించాలని అంతవరకు పూర్తి మద్దతిస్తున్నట్లు అనిల్ కుమార్ తెలియజేశారు. ధర్నా శిబిరంలో టి పి టి ఎఫ్ సీనియర్ నాయకులు తోట హనుమాన్లు మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయ సమ్మతమైన పోరాటానికి ఫెడరేషన్ కార్యకర్తలు అందరూ మద్దతుగా ఉండాలన్నారు. ధర్నా శిబిరంలో టిపిటిఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు వెనిగర్ల సురేష్, ప్రధాన కార్యదర్శి పూదారి అరవింద్, జిల్లా బాధ్యులు రాజు, విజయ్ గంగామణి, కేజీబీవీ ఎస్ ఓ లు ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.