ముగిసిన పార్లమెంట్‌ సమావేశాలు

Concluded Parliament Sessions– 136 శాతం ఉత్పాదకత
– లోక్‌సభ కార్యకలాపాలు 115 గంటలు
– రాజ్యసభ 90.35 గంటలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. వాస్తవానికి ముందుగా విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 12 వరకు సమావేశాలు జరగాల్సి ఉండగా, మూడ్రోజుల ముందుగానే ముగిశాయి. ఈ మూడు రోజుల్లో శని, ఆదివారాల్లో పార్లమెంట్‌కు సెలవు. సోమవారం పార్లమెంట్‌ సమావేశాలు జరగాల్సి ఉంది. కానీ శుక్రవారంతోనే పార్లమెంట్‌ సమావేశాలను ముగించేశారు.
లోక్‌సభ 136 శాతం ఉత్పాదకత జరిగింది. అలాగే 115 గంటల పాటు కార్యకలాపాలు జరిగాయి. కేంద్ర బడ్జెట్‌పై 27.19 గంటల పాటు చర్చ జరిగింది. 181 మంది సభ్యులు ఈ చర్చలో పాల్గొన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ జులై 30న చర్చు సమాధానమిచ్చారు. జులై 30 నుంచి ఆగస్టు 5 వరకు ఎంపిక చేసిన మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్ల డిమాండ్స్‌ అండ్‌ గ్రాంట్స్‌పై చర్చ జరిగింది. అనంతరం డిమాండ్స్‌ అండ్‌ గ్రాంట్స్‌ను ఆమోదించారు. ఆగస్టు 5న కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన బిల్లును లోకసభ ఆమోదించింది. ఈ సమావేశాల్లో 12 బిల్లులు ప్రవేశపెట్టగా, నాలుగు బిల్లులు ఆమోదం పొందాయి. ఫైనాన్స్‌ బిల్లు, కేటాయింపు బిల్లు, జమ్మూ కాశ్మీర్‌ విభజన బిల్లు, ఇండియన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ బిల్లును ఆమోదించారు. 15 రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో 86 ప్రశ్నలను సభ్యులు సభలోనే అడగగా, కేంద్ర మంత్రులు సమాధానం ఇచ్చారు. అలాగే వివిధ అత్యవసర, ప్రజా ప్రాముఖ్యత కలిగిన 400 అంశాలను సభ్యులు లేవనెత్తారు. రూల్‌ 377 కింద 358 అంశాలను లేవనెత్తారు. 73ఏ కింద 25 స్టేట్‌మెంట్‌లు, ప్రభుత్వ పనికి సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రెండు స్టేట్‌మెంట్‌లు, బంగ్లాదేశ్‌, ఒలింపిక్స్‌లో రెజ్లర్‌ వినేష్‌ ఫోగట్‌ అనర్హత వంటి మూడు అంశాలపై సంబంధిత మంత్రులు స్టేట్‌మెంట్లు సహా మొత్తం 30 స్టేట్‌మెంట్‌లు ఇచ్చారు. ఒలింపిక్‌ క్రీడల కోసం ఇండియా సన్నాహాలకు సంబంధించి రూల్‌ 193 కింద స్వల్పకాలిక చర్చ జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టంపై రూల్‌ 197 కింద కాలింగ్‌ అటెన్షన్‌ మోషన్‌పై చర్చ జరిగింది. ఈ సమావేశాల్లో 65 ప్రయివేట్‌ బిల్లులను ప్రవేశపెట్టారు. దేశంలో విమానచార్జీల నియంత్రణకు తగిన చర్యలపై ఎంపీ షఫీ పరంబిల్‌ ప్రవేశపెట్టిన ప్రయివేట్‌ మెంబర్‌ బిల్లుపై చర్చ జరిగింది.
రాజ్యసభలో కేంద్ర బడ్జెట్‌పై 21.48 గంటల పాటు చర్చ జరిగింది. వ్యవసాయం, పట్టణ వ్యవహారాలు, విద్యుత్‌ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్ల డిమాండ్స్‌ అండ్‌ గ్రాంట్స్‌పై చర్చ జరిగింది. బంగ్లాదేశ్‌ పరిస్థితులపై కేంద్ర మంత్రి స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. రాజ్యసభ మొత్తం 90.35 గంటల పాటు లోక్‌సభ కార్యకలాపాలు జరిగాయి. ఈ పార్లమెంట్‌ సమావేశాలను నీట్‌ లీకేజీ వ్యవహారం, రైల్వే భద్రత, ధరలు పెరుగుదల తదితర అంశాలు ఉభయ సభలను కుదిపేశాయి.
విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా జైరాం రమేష్‌ ప్రివిలేజ్‌ మోషన్‌
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా జైరాం రమేష్‌ ప్రివిలేజ్‌ మోషన్‌ ప్రవేశపెట్టారు. శుక్రవారం రాజ్యసభలో కొన్ని ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచి రాజ్యాంగం ఉపోద్ఘాతం తొలగించినందుకు విద్యా మంత్రికి వ్యతిరేకంగా జైరాం రమేష్‌ ప్రివిలేజ్‌ మోషన్‌ను ప్రవేశపెట్టారు. కొన్ని ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల నుంచి ఉపోద్ఘాతం తొలగించడం గురించి సభను తప్పుదారి పట్టించారని ఆరోపిస్తూ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ రాజ్యసభలో ప్రివిలేజ్‌ మోషన్‌ నోటీసును సమర్పించారు.

Spread the love