జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించండి

– భారత ఎన్నికల కమిషన్‌కు రాష్ట్ర ప్రతిపక్ష పార్టీల వినతి పత్రం
– దేశరాజధానిలో జాతీయ ప్రతిపక్ష పార్టీల నాయకులతో సమావేశం
న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితిపై చర్చించడానికి గురువారం ఢిల్లీలోని కానిస్టిట్యూషనల్‌ క్లబ్‌లో జాతీయ ప్రతిపక్ష పార్టీల నాయకులు, జమ్మూకాశ్మీర్‌ ప్రతిపక్ష పార్టీల నాయకులు సమావేశం నిర్వహించారు. జమ్మూకాశ్మీర్‌ ప్రజల హక్కులను, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రహోదాను పునరుద్దరించాలని డిమాండ్‌ చేశారు. జమ్మూలో ఇటీవల జరిగిన అఖిల పక్ష సమావేశంలో తక్షణమే జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ను డిమాండ్‌ చేయాలని, ఈ విషయంపై జాతీయ ప్రతిపక్ష పార్టీల నేతలతో భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం మేరకే ఢిల్లీలో గురువారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి, జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షులు ఫరూక్‌ అబ్దుల్లా, ఎన్‌సీపీ నాయకులు శరద్‌ పవార్‌, కాంగ్రెస్‌, సీపీఐ, ఆర్‌జేడీ, ఆప్‌ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశం తరువాత ఫరూక్‌ అబ్దుల్లా నేతృత్వంలో జమ్మూకాశ్మీర్‌ ప్రతిపక్ష పార్టీల ప్రతినిధుల బృందం భారత ఎన్నికల కమిషన్‌తో భేటీ అయ్యారు. వినతిపత్రం సమర్పించారు. ఈ తరువాత ఎన్‌సీ పార్టీ నాయకులు, ఎంపీ (అనంతనాగ్‌ నియోజకవర్గం) హస్నైన్‌ మసూది మీడియాతో మాట్లాడుతూ జమ్మూకాశ్మీర్‌ ప్రజలకు చెందిన అన్ని ప్రధాన సమస్యలను, ఆందోళనలను ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకుని వచ్చామని, ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని డిమాండ్‌ చేశామని చెప్పారు. ఎన్నికలు నిర్వహించడం ముఖ్యమైన అంశమని, జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికల నిర్వహించడం సంస్థ బాధ్యత అని గుర్తు చేశామని తెలిపారు. ఆప్‌కు చెందిన సీనియర్‌ నాయకులు తరంజిత్‌ సింగ్‌ టోని మాట్లాడుతూ ‘జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితి అంతా బాగుందని ప్రధానమంత్రి, హోం మంత్రి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ చెబుతున్నారు. పరిస్థితి అంతా బాగున్నప్పుడు ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు’ అని ప్రశ్నించారు. శాసనసభకు ఏ విధమైన ప్రత్యామ్నాయం ఉండదని, జమ్మూకాశ్మీర్‌లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అక్కడి అధికార యంత్రాంగం వారి మాట వినడం లేదని ఆరోపించారు.
ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యంగ ఉల్లంఘనే..
భారత ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన వినతిపత్రంలో అనేక కీలక విషయాలను ప్రతిపక్ష నాయకులు ప్రస్తావించారు. జమూకాశ్మీర్‌ గత ఐదేండ్ల నుంచి అసెంబ్లీ, ఎన్నికైన ప్రభుత్వం లేకుండానే కొనసాగుతుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. పంచాయితీలు, ఇతర స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించినా అవి అసెంబ్లీకి ప్రత్యామ్నాయం కాదని, ఎలాంటి ఆలస్యం చేయకుండా జమ్మూకాశ్మీర్‌ ఎన్నికలను నిర్వహించాలని కోరారు. ఓటర్ల జాబితాతో సహా అన్ని ప్రక్రియలను పూర్తి చేశామని, తుది నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల కమిషన్‌ మాత్రమేనని గతంలో కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయాన్ని వినతిపత్రంలో నాయకులు గుర్తు చేశారు. జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల కమిషన్‌ రాజ్యాంగ పరమైన బాధ్యత అని, ఎన్నికలను ఆలస్యం చేయడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, జమ్మూకాశ్మీర్‌ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను నిరాకరిండమేనని నాయకులు విమర్శించారు. జమ్మూకాశ్మీర్‌ ఎన్నికల నిర్వహించడం అనేది జమ్మూకాశ్మీర్‌కు భారత రాజ్యాంగం ప్రసాదించిన అన్ని హామీలను పునర్దురించడానికి, ఈ ప్రాంత ప్రజల రాజకీయ అభిలాషలను నెరవేర్చడానికి మొదటి అడుగుగా నాయుకులు వినతిపత్రంలో అభివర్ణించారు. జమ్మూ కాశ్మీర్‌లో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికల షెడ్యూల్‌ను నోటిఫై చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ వినతిపత్రంపై జమ్మూకాశ్మీర్‌ ప్రతిపక్ష నాయకులతో పాటు మల్లికార్జున ఖర్గే, సీతారాం ఏచూరి, టిఆర్‌ బాలు, శరద్‌ పవార్‌, సంజరు సింగ్‌ వంటి ఇతర జాతీయ ప్రతిపక్ష పార్టీల నాయుకులు కూడా సంతకం చేశారు.

Spread the love