కుల గణనపై నేడు కలెక్టర్లతో కాన్ఫరెన్స్‌

Deputy CM Bhatti– మేం ప్రజాభిప్రాయానికి పట్టంగడతాం : సామాజికవేత్తలు, మేధావులతో భేటీలో డిప్యూటీ సీఎం భట్టి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో చేపట్టనున్న కుల గణన (సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉపాధి, కుల సర్వే) దేశవ్యాప్తంగా ఒక మోడల్‌గా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సర్వే సందర్భంగా తాము ప్రజాభిప్రాయానికే పట్టంగడతామని ఆయన తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సామాజికవేత్తలు, మేధావులతో సమావేశమైన డిప్యూటీ సీఎం… కుల గణనలో చేయాల్సిన మార్పులు, చేర్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాలోచనలు చేశారు. వచ్చే నెల ఆరు నుంచి చేపట్టబోయే ఈ గణనకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికతోపాటు దిశా నిర్దేశం చేయడానికి వీలుగా మంగళవారం… కలెక్టర్లతో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ప్రజల నుంచి సమాచారం తీసుకునేందుకు ఇంకా ఎలాంటి ప్రశ్నలు వేస్తే బాగుంటుందనే అంశంపై వారిని అడిగి తెలుసుకున్నారు. మరికొద్ది రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 300 మంది సామాజికవేత్తలు, మేధావులు, అభ్యుదయవాదులతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించటం ద్వారా కుల గణనపై వారి నుంచి సలహాలను స్వీకరిస్తామని తెలిపారు. ఆ భేటీకి కుల, యువజన సంఘాలను కూడా ఆహ్వానిస్తామని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్లను కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములను చేసి, వారి అభిప్రాయాను కూడా సేకరిస్తామని వివరించారు. సర్వేకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన ప్రశ్నాపత్రం బాగుందంటూ సామాజికవేత్త యోగేంద్ర యాదవ్‌ సైతం ప్రశంసించారని తెలిపారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కుల గణన చేపడతామంటూ కామారెడ్డిలో ఎన్నికలకు ముందు నిర్వహించిన బీసీ డిక్లరేషన్‌ బహిరంగ సభలో ప్రకటించామని గుర్తు చేశారు. ఎలక్షన్‌ మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని పొందుపరిచామని చెప్పారు. ఆ ప్రకారంగా ఇప్పుడు కుల గణనను చేపట్టబోతున్నామని వివరించారు. సర్వే సందర్భంగా న్యాయ పరమైన చిక్కులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న ప్రొఫెసర్‌ మురళి మనోహర్‌ సూచించారు. ఒక ఎన్యుమరేటర్‌ రోజుకు 15 ఇండ్లను సర్వే చేయడం కష్టమవుతుందనీ, అందువల్ల ఆ సంఖ్యను పదికి కుదించాలని విద్యా కమిషన్‌ చైర్మెన్‌ ఆకునూరి మురళి సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ కోదండరామ్‌, ప్రొఫెసర్‌ సింహాద్రి, సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి, డిప్యూటీ సీఎం స్పెషల్‌ సెక్రటరీ కృష్ణ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love