చంద్రబోస్ రచించిన గీతాల గురించి వారే స్వయంగా తమ మనసులోని మాటలను తెలియజేస్తూ, ఆ పాటను గాయనీ గాయకులు గీతామాధురి దీపు, పి విఎన్‌ఎస్ రోహిత్, సత్య యామిని, అతిథి భావరాజు, సాయి చరణ్ లతో పాడించడం విశేషం. మురళీ మోహన్, సంగీత దర్శకురాలు శ్రీలేఖ, ముప్పలనేని శివ, గీత రచయిత రామ జోగయ్య శాస్త్రి తదితరులు ఈ వేడుకలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. చంద్రబోస్ మాట్లాడుతూ, ‘నా మొదటి పాటకు శ్రీలేఖ అద్భుతమైన బాణి ఇచ్చారు. నన్ను రామా నాయుడు ఎంతో ప్రోత్సహించారు. 95లో మొదలైన నా ప్రయాణం… 2023 వరకు 28 సంవత్సరాల్లో 800 సినిమాల్లో 3600పైగా పాటలు రాశాను. నాకు, నా జీవితానికి పరిపూర్ణత తీసుకు వచ్చిన సంవత్సరం 2023. ఫిబ్రవరిలో గోల్డెన్ గ్లోబ్, రెండవది హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్, మూడవది క్రిటిక్స్ అవార్డ్స్, నాలుగవది ఆస్కార్, ఐదవది బాంబే హంగామా అవార్డు, ఆరవది జాతీయ పురస్కారం. ఇలా ఈ ఏడాదిలో ఆరు అవార్డుల వర్షం కురిసింది. భార్యని అర్థాంగి అంటారు. నేను అర్థాంగి అనను పూర్ణంగి అంటాను’ అని తెలిపారు.