కార్మికుల వీరోచిత పోరాటానికి అభినందనలు

–  భవిష్యత్‌లోనూ ఇలాంటి ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలి : ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ విజ్ఞప్తి
–  మోడీ పాలనలో రోడ్డు రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుందని వ్యాఖ్య
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రోడ్డు రవాణా కార్మికుల పోరాటానికి ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌(ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌) అభినందనలు తెలిపింది. ఐపీసీ స్థానంలో మోడీ సర్కారు తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)-2023లోని దారుణమైన నిబంధనకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన రోడ్డు రవాణా కార్మికులను అభినందించింది. రోడ్డు రవాణా కార్మికులు ఒకే స్వరంతో జాతీయ స్థాయిలో ఒత్తిడి పెంచినందున, ప్రభుత్వం దిగిరావాల్సి వచ్చిందని పేర్కొన్నది. ఈ మేరకు ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌. లక్ష్మయ్య ఒక ప్రకటనను విడుదల చేశారు. కఠిన నిబంధనలను అమలు చేసే ముందు ప్రభుత్వం అసోసియేషన్‌తో చర్చిస్తుందని హామీ ఇచ్చినట్టు మీడియాలో వార్తలు వచ్చాయనీ, ఇది రవాణా కార్మికుల ఐక్యత, పోరాట బలాన్ని ప్రదర్శించిందని ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ స్పష్టం చేసింది. అయితే పార్లమెంట్‌లో కఠిన నిబంధనను ఉపసంహరించుకుని ప్రభుత్వం బీఎన్‌ఎస్‌ చట్టాన్ని సవరించే వరకు తలపై కత్తి వేలాడుతూనే ఉంటుందని ఫెడరేషన్‌ హెచ్చరించింది. రోడ్డు రవాణా కార్మికులు అప్రమత్తంగా ఉండాలనీ, గతంలో రైతులకు ద్రోహం చేసినందున ప్రభుత్వం తన వాగ్దానాల నుంచి వెనక్కి వెళ్తే ఏ సమయంలోనైనా పోరాటానికి సిద్ధంగా ఉండాలని ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ విజ్ఞప్తి చేసింది. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ రంగ వ్యతిరేక విధానాలతో రోడ్డు రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. క్రూడాయిల్‌ ధరలు 2014 కంటే తక్కువగా ఉన్నప్పుడు కూడా పెట్రోలు, డీజిల్‌ అసాధారణంగా పెరగడం, ఇన్సూరెన్స్‌ ప్రీమియం భారీ పెంపుదల, టోల్‌ ట్యాక్స్‌, ఎం.వీ యాక్ట్‌ సవరణ, వెహికిల్‌ స్క్రాపింగ్‌ విధానం వంటి భారీ భారం పరిశ్రమతో పాటు కార్మికులను ఇప్పటికే నాశనం చేశాయని వివరించింది. ఇది చిరు యజమానులకు పెద్ద దెబ్బ అనీ, ఈ విధానాలను తిరిగి మార్చే వరకు, రోడ్డు రవాణా రంగం మనుగడ సాగించదని ఫెడరేషన్‌ పేర్కొన్నది. రోడ్డు రవాణా కార్మికులు, ముఖ్యంగా అసంఘటిత రోడ్డు రవాణాలో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా ఉన్నదనీ, వారు అనారోగ్యంతో ఆస్పత్రులపాలవుతున్నారని వివరించింది. వారు ఎలాంటి కార్మిక చట్టం కింద కానీ, ఉద్యోగ, సామాజిక భద్రత కిందకు కానీ రారని ఫెడరేషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. జాతీయ బ్యాంకులు, ప్రభుత్వం కొత్త వాహనాల కొనుగోలుకు, ఎలక్ట్రిక్‌ వాహనాలకు మారటానికి ఆర్థిక సహాయాన్ని (రుణాలు) అందించడం లేదని పేర్కొన్నది.
పైన పేర్కొన్న అన్ని సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని ఫెడరేషన్‌ అందరికీ విజ్ఞప్తి చేసింది. రోడ్డు రవాణా రంగంలో పనిచేస్తున్న అన్ని ట్రేడ్‌ యూనియన్లూ, ఆపరేటర్స్‌ అసోసియేషన్లు పరిశ్రమను, కార్మికుల సంక్షేమాన్ని రక్షించడానికి ఒక ఉమ్మడి వేదికపైకి రావాలని ప్రతిపాదించింది.

Spread the love