రాజ్యాంగంపై కాంగ్రెస్‌ దాడి

Congress attack on the Constitution– ఇచ్చిన హామీలు ఆ పార్టీ అమలు చేయటం లేదు
– గవర్నర్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం విస్మరిస్తోందనీ, రాజ్యాంగం మీద అది దాడి చేస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఇదే అంశంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన గవర్నర్‌ రాధాకృష్ణన్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ యువతపై సీఎం రేవంత్‌ రెడ్డి నిర్భందాన్ని ప్రయోగిస్తున్నారనీ, కేసులు పెడుతున్నారని తెలిపారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలిస్తామనీ, జాబ్‌కార్డు ప్రకటిస్తామని చెప్పారని ఇప్పటి వరకూ ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదని విమర్శించారు. గ్రూప్‌ 1, 2, 3 పోస్టులు పెంచుతామన్న ఆ హామీని పట్టించుకోవటం లేదని వివరించారు. పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్‌ ప్రోత్సహిస్తున్న విషయాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకుపోయినట్టు చెప్పారు. రాష్ట్రంలో రాజ్యాంగంపై జరుగుతున్న దాడి, ఇతర అంశాలను కూడా వివరించామన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ హననం జరుగుతోందని తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను భయపెట్టి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారన్నారు. ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తున్నామనీ, స్పీకర్‌కు కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు. ప్రొటోకాల్‌ ఉల్లంఘన జరుగుతోందని తెలిపారు. మేడిగడ్డ కొట్టుకుపోయిందనీ, కాళేశ్వరంలో లక్ష కోట్లు గంగపాలయ్యాయంటూ చిల్లర ప్రచారం చేసిన కాంగ్రెస్‌ ఇప్పుడు సిగ్గుతో తలదించుకోవాలని విమర్శించారు. త్వరలోనే మేడిగడ్డను సందర్శిస్తామనీ, ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని చెప్పారు. పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్‌ సెంటర్లకు వందల కోట్లు లాభం వస్తుందన్న సీఎం మాటలను గుర్తు చేశారు. ఇప్పుడు నాలుగు నెలలు వాయిదా వేశారు కదా? రూ. నాలుగొందల కోట్లు వస్తున్నాయా? అందులో సీఎం వాటా ఎంత? అని ప్రశ్నించారు.

Spread the love