కేసీఆర్‌, హరీశ్‌ ఇలాకాలో..కాంగ్రెస్‌, బీజేపీ

– రెండు చోట్లా బీఆర్‌ఎస్‌ మూడో స్థానం
– కారు కొంప ముంచిన క్రాస్‌ ఓటింగ్‌
– మెదక్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉన్నా ఓట్లు పడని వైనం
– గులాబీ ఎమ్మెల్యేలున్న చోటా అదే పరిస్థితి
మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు ఇలాకాలోని మెదక్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌, బీజేపీ చెరోటి గెలిచాయి. బీఆర్‌ఎస్‌ రెండు సిట్టింగ్‌ స్థానాల్లోనూ ఘోరంగా ఓటమిపాలైంది. బీఆర్‌ఎస్‌ ఓటర్లు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడటం వల్లనే కారు కొంప మునిగిందని విశ్లేషకులు అంటున్నారు. పార్టీ అభ్యర్థికి కాదని బీజేపీకి ఓట్లేసిన పరిస్థితి పోలైన ఓట్లతో స్పష్టమైంది. మెదక్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ఎమ్మెల్యే ఉన్నా ఆ పార్టీ ఎంపీ అభ్యర్థికి మాత్రం బీజేపీ కంటే తక్కువ ఓట్లు రావడం గమనార్హం. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలున్న చోట కూడా ఆ పార్టీ ఎంపీ అభ్యర్థులకు కనీస ఓట్లు రాలేదు. పైగా రెండు చోట్లా గులాబీ పార్టీ మూడో స్థానానికే పరిమితమైంది.
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి మాదవనేని రఘునందన్‌రావు విజయం సాధించారు. నువ్వానేనా అన్నట్టు మెదక్‌లో త్రిముఖ పోటీ జరిగినప్పటికీ చివరికి బీజేపీనే విజయం వరించింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 4,71,217 ఓట్లు రాగా కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధుకు 4,32,078 ఓట్లు వచ్చాయి. దాంతో కాంగ్రెస్‌పై బీజేపీ అభ్యర్థి 39,139 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామ్‌రెడ్డి 3,96,790 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. పోస్టల్‌ బ్యాలెట్లలోనూ బీజేపీకి 7440 ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 4179, బీఆర్‌ఎస్‌కు 1540 ఓట్లు వచ్చాయి. మొదటి ఐదారు రౌండ్ల వరకు బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య పోటా పోటీ ఓట్లు వచ్చాయి. ఆ రౌండ్లలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామ్‌రెడ్డి ఆధిక్యంలో కొనసాగారు. దాంతో రాష్ట్రమంతటా మెదక్‌ ఓట్ల లెక్కింపుపైనే దృష్టి మళ్లింది. ఆ తర్వాత జరిగిన రౌండ్లల్లో బీజేపీ అభ్యర్థి అనూహ్యంగా మెజార్టీలోకి వచ్చారు. అలా ప్రతి రౌండ్‌లోనూ రఘునందన్‌రావు మెజార్టీ పెరుగుతూ వచ్చింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామ్‌రెడ్డి మొదట్లో లీడ్‌లో ఉండి ఆ తర్వాత ఆయన మూడో స్థానంలో ఉండిపోయింది. కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు మొదట్లో వెనకబడి మూడో స్థానంలో ఉండగా క్రమ క్రమంగా బీఆర్‌ఎస్‌ కంటే ముందుకు వచ్చారు. ఐదు వేల నుంచి మొదలైన బీజేపీ లీడ్‌ క్రమక్రమంగా పెరుగుతూ 39,139 ఓట్ల మెజార్టీతో రఘునందన్‌రావు విజయం సాధించారు. రఘునందన్‌రావు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. వెనువెంటనే పార్లమెంట్‌ ఎన్నికలు రావడంతో వ్యక్తిగత సానుభూతి కూడా ఆయన గెలుపునకు పనిచేసింది. పటాన్‌చెరు, మెదక్‌, సిద్దిపేట లాంటి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలున్న చోట కూడా బీజేపీ అత్యధికంగా ఓట్లు పొందగలిగింది.
రెండు సిట్టింగ్‌ స్థానాల్ని కోల్పోయిన బీఆర్‌ఎస్‌
మెదక్‌, జహీరాబాద్‌ రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలు కూడా బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానాలైనా ఓటమి పాలైంది. మెదక్‌ ఎంపీగా బీఆర్‌ఎస్‌ పాతికేండ్లుగా గెలుస్తూ వచ్చింది. ఈ సారి కూడా గెలుస్తామని ఆశపెట్టుకుని గట్టిగా పనిచేసింది. ఇక్కడా అక్కడా రెండు చోట్ల కూడా ఘోరంగా ఓటమిపాలవ్వడంతో గులాబీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. కేసీఆర్‌, హరీశ్‌రావు ఇలాకలో బీజేపీ గెలుపొందడాన్ని ఆ పార్టీ నాయకత్వం జీర్ణించుకోలేకపోతుంది. నియోజకవర్గంలోని ఉత్తర భారతదేశం ఓటర్లు మోడీ ప్రభావంతో బీజేపీ వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో అత్యధిక భాగం బీజేపీకే ఓట్లు పడ్డాయని విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌కు అధికారం లేకపోవడం కూడా బీజేపీ వైపు మొగ్గు చేపారనే వాదనలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 14 అసెంబ్లీ స్థానాలకు గాను బీఆర్‌ఎస్‌ 8 స్థానాల్లో భారీ మెజార్టీతో గెలిచింది. ఆరు నెలల వ్యవధిలో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో మాత్రం రెండు చోట్ల ఓటమిని చవిచూడటం మాత్రమేనని విశ్లేషకులు అంటున్నారు.
బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీకి క్రాస్‌ ఓటింగ్‌
బీఆర్‌ఎస్‌ స్వయంకృతాపరాధం వల్లనే మెదక్‌లో బీజేపీ అభ్యర్థి గెలుపునకు దారి తీసింది. జహీరాబాద్‌లో గట్టి పోటీ ఇచ్చేలా ఓట్ల శాతాన్ని పెంచగలిగింది. మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలున్న పటాన్‌చెరు నియోజకవర్గంలో ఆ పార్టీకి ఆశించిన ఓట్లు రాలేదు. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఎంపీ ఎన్నికల్ని పట్టించుకోలేదని ఆ పార్టీలోనే చర్చ నడుస్తోంది. దాంతో ఆ పార్టీ నాయకత్వం బీజేపీకి పనిచేసినట్టు సమాచారం. నార్త్‌ ఇండియన్స్‌ అధికంగా ఉన్న పటాన్‌చెరులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేనే స్వయంగా సహకరించడంతో బీజేపీకి కలిసొచ్చిందనే చర్చ ఉంది. సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డిలోనూ బీజేపీకి ఓట్లు పెరిగాయి. బీఆర్‌ఎస్‌కు ఓట్లు తగ్గాయి. జహీరాబాద్‌ ఎంపీ పరిధిలోనూ ఇద్దరు ఎమ్మెల్యేలు, ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలున్నపట్పికీ పెద్దగా పట్టించుకోకపోవడం, స్థానికేతరుడైన గాలి అనిల్‌కుమార్‌ను పోటీ చేయించడంతో గులాబీ శ్రేణులు బీజేపీ, కాంగ్రెస్‌కు క్రాస్‌ ఓటింగ్‌ చేశారు.
జహీరాబాద్‌లో కాంగ్రెస్‌ గెలుపు
జహీరాబాద్‌ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌ సభ్యులుగా కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన సురేష్‌ షేట్కర్‌ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌పై ఘన విజయం సాధించారు. నియోజకవర్గంలో 16,41,410 ఓట్లు ఉండగా 12,25,049 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి సురేష్‌షేట్కర్‌కు 5,23,919 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌కు 4,76,023 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌కు 1,71,412 ఓట్లు మాత్రమే వచ్చాయి. దాంతో కాంగ్రెస్‌ అభ్యర్థి బీజేపీపై 47,896 ఓట్ల మెజార్టీ సాధించారు. 2009లో కూడా సురేష్‌ షేట్కర్‌ జహీరాబాద్‌ ఎంపీగా గెలిచారు. జహీరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చూపిన పర్ఫార్‌మెన్స్‌ ఎంపీ ఎన్నికల్లోనూ కనిపించింది. దాంతో బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ ఏ ఒక్క రౌండ్‌లోనూ మెజార్టీ చూపలేకపోయారు. ఇద్దరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలున్నా అక్కడ ఆ పార్టీకి ఆశించిన మేర ఓట్లు రాలేదు.

Spread the love