కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అవినీతి పార్టీలు

Congress and BRS are corrupt parties– అధికారం ఎవరికుంటే వారికే మజ్లిస్‌ వత్తాసు
– తెలంగాణలో కనీసం 12 ఎంపీ సీట్లు గెలవాలి : బూత్‌ లెవల్‌ అధ్యక్షుల సభలో కేంద్రహోంమంత్రి అమిత్‌ షా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు అవినీతి పార్టీలని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఆరోపించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒక్కటేననీ, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే దానికి వత్తాసు పలకటం మజ్లీస్‌ నైజమని విమర్శించారు. తెలంగాణలో కనీసం 12 ఎంపీ సీట్లను గెలిపించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళ వారం సికింద్రాబాద్‌లో జరిగిన బీజేపీ సోషల్‌ మీడియా వారియర్స్‌ సభలోనూ, ఆతర్వాత నాంపల్లిలోని ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ బూత్‌ లెవల్‌ అధ్యక్షులు, మండల, జిల్లా పదాధికారుల సభలోనూ ఆయన పాల్గొన్నారు. అనంతరం భాగ్యలక్ష్మి ఆలయంలో హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి మాధవిలతతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కనీసం డజన్‌ స్థానాల్లోనైనా ఎంపీ అభ్యర్థులను గెలిపించాలనీ, ప్రతి ఒక్కరూ తమ బూత్‌ లెవల్‌లో కష్టపడి ఎక్కువ ఓట్లు సాధించేలా చూడాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, మజ్లీస్‌ నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తారా? లేదా? అని శ్రేణులను ప్రశ్నించారు. మజ్లిస్‌ పార్టీ ఎవరు అధికారంలో ఉంటే వారికి వత్తాసు పలుకుతుందని విమర్శించారు. ఈ సారి హైదరాబాద్‌ స్థానంలో మజ్లిస్‌ పని ఖతమేనని చెప్పారు. ఇండియా కూటమిలోని పార్టీల్లో ఎక్కువగా కుటుంబ పార్టీలే ఉన్నాయనీ, వాటి అధినేతలు తమ కొడుకునో, కూతుర్నో సీఎంను చేయాలని చూస్తాయని చెబుతూ పలువురు నేతల పేర్లను ప్రస్తావించారు. అలాంటి నేతలు ప్రజల క్షేమాన్ని పట్టించుకుంటారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ హయాంలో టూజీ, భోఫోర్స్‌, ఇలా నింగి నుంచి నేల వరకు అన్నింటినీ దోచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ హయాంలో అవినీతి జరగలేదని రేవంత్‌రెడ్డి చెప్పగలరా? అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మంచి చేస్తామంటే ఎవ్వరూ నమ్మరని చెప్పారు. మోడీ పదేండ్ల పాలలో 25 పైసల అవినీతి కూడా జరగలేదన్నారు. కేసీఆర్‌ నీళ్లు, నిధులు, నియామకాలు ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. మోడీ పాలనలో లాల్‌చౌక్‌లో జాతీయ జెండా ఎగురవేశామనీ, ఇప్పుడు పోలీసు పహారా మధ్య వెళ్లాల్సిన పరిస్థితి లేదని అన్నారు. 500 ఏండ్ల ఆయోధ్య మందిరం ఏర్పాటు కలను నెరవేర్చామన్నారు. మన దేశంలోకి ఉగ్రవాదులు జొరబడాలని చూస్తే తరితరిమి కొట్లామన్నారు. సీఏఏ నాగరికత ఇచ్చేదనీ, హరించేది కాదని చెప్పారు. రైతులకు, యువతకు, మహిళలకు, దళితులకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు అండగా ఉండబోవన్నారు. వారి అభివృద్ధి కోసం పాటుపడేది బీజేపీనేనని నొక్కి చెప్పారు. దేశంలో 400 సీట్లలో గెలిపించి మూడోసారి మోడీని ప్రధానిని చేయాలని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..ఎన్నికల ప్రచారానికి శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రియల్టర్లు, బిల్డర్లు, పెద్దపెద్ద వ్యాపారుల నుంచి రాహుల్‌గాంధీ ట్యాక్స్‌ను వసూలు చేస్తున్నదని ఆరోపించారు. కేసీఆర్‌ నియంతృత్వ పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందలేదన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజరు మాట్లాడుతూ..రాముడి పేరుతో బరాబర్‌ ఓట్లు అడుగుతామన్నారు. తమ వెనుక రాముడు, ఆయన వారసుడు మోడీ ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయాలంటే రూ.5 లక్షల కోట్ల బడ్జెట్‌ కావాలనీ, ప్రస్తుత బడ్జెట్‌లో వాటి కోసం కేవలం రూ.53 వేల కోట్లు చూపారని విమర్శించారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. 40 రోజులు గ్రామాల్లోనే ఉండి బీజేపీ గెలుపు కోసం కృషి చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సభలో బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఈటల రాజేందర్‌, బూర నర్సయ్యగౌడ్‌, భరత్‌, బీబీ పాటిల్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డి.అర్వింద్‌కుమార్‌, మాధవీలత, బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్‌ శంకర్‌, వెంకటరమణారెడ్డి, హరీశ్‌బాబు, నేతలు ప్రకాశ్‌రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, బి.శృతి తదితరులు పాల్గొన్నారు.

Spread the love