దేశ ప్రజల కోసం కాంగ్రెస్‌… కార్పొరేట్ల కోసం బీజేపీ

– జై జవాన్‌..జై కిసాన్‌ మా నినాదొం పంజాబ్‌ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
దేశ ప్రజల కోసం కాంగ్రెస్‌ పార్టీ పని చేస్తుంటే బీజేపీ మాత్రం బహుళ జాతి కంపెనీల కోసం పని చేస్తున్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు ఆయన పంజాబ్‌ రాష్ట్రంలోని ఫరీద్‌ కోట్‌ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి అమర్జీత్‌ కౌర్‌ సాహోకు మద్దతుగా పలు సభల్లో పాల్గొని ప్రసంగించారు. బుధవారం సాయంత్రం కొట్కాపుర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. మచకి కలన్‌ గ్రామంలో ప్రశ్న-సమాధానం కార్యక్రమంలో విక్రమార్క పాల్గొన్నారు. గురువారం సాయంత్రం బాగా పురాణలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ దేశ వనరులు, సంపద ప్రజలకే చెందాలనే ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఇందుకు దేశంలోని ఆస్తులను, వ్యవస్థలను అమ్మి కొద్ది మందికే కట్టబెట్టేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. దేశంలో శాంతి, సౌభాతృత్వం వెల్లి విరియాలని ఇండియా బ్లాక్‌ ఓ వైపు పోరాటం చేస్తుంటే, జాతి, మతం పేరిట విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ది పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనీ, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలనీ, సంపద పేదలకు పంచాలని ఉద్దేశంతో రాహుల్‌ గాంధీ నాయకత్వంలో పెద్ద ఎత్తున పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఓబీసీ, బీసీ, ఎస్సీల రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు. ఇండియా బ్లాక్‌ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా ఇంటి పెద్ద బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయల నగదు జమ చేస్తామన్నారు. తాము మహిళలను మహారాణులుగా చేస్తామన్నారు. కాంగ్రెస్‌ సర్కారు ఎప్పుడు పేదల గురించే ఆలోచిస్తుందనీ, బీజేపీ మాత్రం పేదలకు రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. అదానీ, అంబానీ వంటి కొద్ది మంది పెద్దలకు మాత్రం రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందన్నారు. మోడీ పదేండ్ల పాలనలో 100 లక్షల కోట్ల అప్పులు చేసి దేశాన్ని అప్పులకుప్పగా మార్చారని విమర్శించారు. జనాభా దామాషా ప్రకారం దేశ సంపద పంపిణీ జరగాలని కోరారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయనీ, అదే విధంగా అన్ని చోట్ల రిజర్వేషన్లు పెంచుతామని ఇండియా బ్లాక్‌ స్పష్టం చేసిందన్నారు. తాము పేదల కోసం పథకాలు ప్రకటించామనీ, బీజేపీ మాత్రం తమ పార్టీని విమర్శించడమే పని గా పెట్టుకుందన్నారు. యూపీఏ హయాంలో ఉపాధి హామీ చట్టం, ఆహార భద్రత, రూరల్‌ హెల్త్‌ మిషన్‌, భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయకరణ తదితర సందర్భాల్లో సైతం వారు విమర్శించారని గుర్తు చేశారు. ప్రాణాలు లెక్కచేయకుండా సరిహద్దుల్లో కాపలాకాస్తున్న వీర జవాన్ల స్థాయిని మోడీ ప్రభుత్వం కార్మికుల స్థాయికి దిగజార్చిందని విమర్శించారు. ఇండియా బ్లాక్‌ అధికారంలోకి రాగానే అగ్నివీర్‌ పథకాన్ని రద్దు చేస్తుందని భరోసా ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదల ఆరోగ్య బీమాకు సంబంధించిన రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచామనీ, అదే తరహాలో ఇండియా బ్లాక్‌ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. మద్దతు ధర, రుణమాఫీ కోసం ఢిల్లీలో రైతులు నెలల తరబడి ఆందోళన చేస్తే మోడీ పది నిమిషాలు కూడా వారి కోసం కేటాయించలేదని తెలిపారు.
ఆ పోరాటంలో వందలాది మంది రైతులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు. జై జవాన్‌ జై కిసాన్‌ అదే తమ అసలుసిసలు నినాదమన్నారు. నెహ్రూ కాలం నుంచి మొన్నటి మన్మోహన్‌ సింగ్‌ వరకు సంక్షేమమే ధ్యేయంగా పని చేశామని గుర్తు చేశారు. దేశంలో హరిత విప్లవం తీసుకువచ్చి వ్యవసాయ ఉత్పత్తులను మూడింతలు పెంచిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వాల దేనన్నారు. రైతు, శ్రామికుల రుణమాఫీకి ఇండియా బ్లాక్‌ కట్టుబడి ఉందన్నారు. తెలంగాణలో రైతు రుణమాఫీ చేయబోతున్న విషయాన్ని వివరించారు. ఉపాధి హామీ చట్టం ద్వారా ప్రతిరోజు రూ. 400 కూలీ భద్రతను ఇండియా బ్లాక్‌ కల్పిస్తుందని హామీనిచ్చారు. జనాభా దామాషా ప్రకారం ఈ దేశ సంపద, వనరులు పంపిణీ చేయడమే లక్ష్యంగా రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు పాదయాత్ర, మణిపూర్‌ నుంచి ముంబై వరకు బస్సుయాత్ర నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు విక్రమార్క వివరించారు.

Spread the love