కార్మికుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలి

Congress government should change its attitude towards workers– ప్రజా పాలనలో పండుగ పూట కార్మికులు పస్తులేనా?
– సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
కార్మికుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని, ప్రజా పాలనలో పండగ పూట కార్మికులు పస్తులు ఉండాలా అని నిజామాబాద్ సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ప్రశ్నించారు.  ప్రజలందరూ జరుపుకునే అత్యంత ముఖ్యమైన బతుకమ్మ, దసరా పండుగలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశాలకు సెప్టెంబర్ నెల పారితోషికాలు, లెప్రసి, పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు తక్షణమే చెల్లించాలని, శుక్రవారం డీఎంహెచ్వో కార్యాలయంలో ఆశా వర్కర్లకు బకాయి వేతనాలు ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. గత రెండు నెలల నుండి రాష్ట్ర ప్రభుత్వం ఆశాలకు ప్రతినెలా పారితోషికాలను నెల చివరి తేదీన చెల్లించింది. ఇదే పద్ధతిలో సెప్టెంబర్ నెల పారితోషికాలు కూడా సెప్టెంబర్ నెల చివరి తేదీన అకౌంట్లో పడతాయని ఆశాలు ఆశించారు. కానీ సెప్టెంబర్ నెల చివరి తేదీ దాటి మూడు రోజులు గడుస్తున్నప్పటికీ నేటికీ పారితోషీకాలు రాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆశాలు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. పైగా మహిళలు, పురుషులు మొత్తం కుటుంబ సభ్యులు అత్యంత ఘనంగా జరుపుకునే బతుకమ్మ, దసరా ముఖ్యమైన పండుగలు కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో పారితోషికాలు సకాలంలో రాకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లందరూ తీవ్రమైన నిరాశకు గురవుతున్నారు. బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా అనేక ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యులంతా కొత్త బట్టలు కొనుక్కోవాలి, రకరకాల వంటలు చేసుకోవాలి, ఇంకా తదితర అనేక ఖర్చులు ఉంటాయి. ఈ పండుగల సందర్భంగా ఆశాలపైన ఆర్థిక భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని ఆశాలు విజ్ఞప్తి చేస్తున్నారు. సెప్టెంబర్ నెల పారితోషికాలతో పాటు 2023, 2024 రెండు సంవత్సరాల లెప్రసీ సర్వే, 2024లో చేసిన పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు మొత్తం చెల్లించి ఆశాలను రాష్ట్ర ప్రభుత్వం పండుగల సందర్భంగా ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను వెంటనే పరిశీలించి పరిష్కారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లలిత, శోభ, పర్షియన్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love