రైతులను దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

Congress government that lied to the farmers– రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

– వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద రైతులతో కలిసి ధర్నా 
– ధర్నాకు పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళ రైతులు 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
రుణమాఫీ పేరట  రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసిందని రాష్ట్ర మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో సగం మంది రైతులకు కూడా ఈ ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి రైతులందరికీ ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారన్నారు. శనివారం వేల్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కల్వకుంట్ల తారక రామారావు  ఆదేశాల మేరకు మాజీ మంత్రి, బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ 100 శాతం  చేస్తామని మాట తప్పిన రేవంత్ రెడ్డి అబద్ధపు హామీలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. బాల్కొండ నియోజకవర్గం లోని అన్ని మండలాల నుండి తరలివచ్చిన రుణమాఫీ కానీ బాధిత రైతులు, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించారు.  ఈ నిరసన కార్యక్రమంలో సతీ సమేతంగా పాల్గొన్న ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మాటిచ్చి గట్టెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ హామీలు మరిచి రైతులను మోసం చేసిందన్నారు. మొదటి డిసెంబర్ 9న అన్న రేవంత్ రెడ్డి మాట మార్చి వంద రోజులు ఉన్నాడని  అటు తర్వాత ఆగస్టు 15 పేరుతో ఏ జిల్లాకు వెళితే ఆ జిల్లాలలో ఉన్న ప్రసిద్ధ దేవుళ్లపై ప్రమాణాలు చేసి కాలయాపన చేశాడన్నారు. తీరా ఆగస్టు 15 గడిచిన రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ కాలేదని  ఆరోపించారు. దేవులపై ఒట్టు  వేస్తూ మరి ఇప్పటికి మూడుసార్లు రైతులను రేవంత్ రెడ్డి మోసం చేశాడన్నారు. బాల్కొండ నియోజకవర్గం లో ఎన్ని మండలాల్లో కలిపి 47 వేల 70 మంది రైతులు రుణాలు తీసుకున్నారన్నారు. అందులో ప్రభుత్వ విప్లవలు చేసిన మూడు విడతల్లో కలిపి 15 వేల 200 మందికి మాత్రమే రుణమాఫీ అయ్యిందన్నారు. ఇంకా 31వేల 200 మందికి రుణమాఫీ అందాల్సి ఉందని తెలిపారు. రుణమాఫీ అందని రైతులు కడుపు మండి ప్రభుత్వంపై వ్యతిరేకతతో నేడు రోడ్డు ఎక్కారని ప్రశాంత్ రెడ్డి తెలిపారు.రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా, ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ కాకపోతే ఆందోళనృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ధర్నా కార్యక్రమానికి మహిళా రైతులు, రైతులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Spread the love